మేడ్చల్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరిని ట్రాఫిక్ చక్రవ్యూహం నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మల్కాజిగిరిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాజ్పేయినగర్ ఆర్యూబీ నిర్మాణానికి రూ.74.47 కోట్ల నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు.
గతంలోనే తుర్కపల్లి ఆర్‌యూబీకి రూ.5 కోట్లు జనప్రియ ఆర్‌యూబీకి 6.6 కోట్లు, ఆర్కేపురం ఆర్‌యూబీకి రూ.35 కోట్లు గౌతమ్‌నగర్ ఆర్‌యూబీకి రూ.28 కోట్ల నిధులు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. తాజాగా బుధవారం వాజ్పేయినగర్ ఆర్‌యూబీకి రూ.74.47 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులను సాధించినట్లు ఎమ్మెల్యే వివరించారు.
ఆర్కేపురం ఫ్లైఓవర్‌కు రూ.210 కోట్లు, ఏవోసీ రోడ్ల అభివృద్ధికి రూ.464 కోట్లు, సఫిల్‌గూడలో యూపీహెచ్సీ నిర్మాణానికి రూ.1.43 కోట్లు, జిల్లా కోర్టు భవనం నిర్మాణానికి రూ. 42 కోట్లు, మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కోసం రూ. 2 కోట్లు, రూ. 42 కోట్లతో సబ్స్టేషన్ల నిర్మాణం తదితర పనులకు నిధులను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, నాయకులు బద్దం పరశురాంరెడ్డి, జేఏసీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.