వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ఫలితంగా గడిచిన రెండేళ్ల మాదిరిగానే ఈ సారి వర్షాకాలంలో వరద ముంపు సమస్య నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నది. నిధుల లేమి ప్రభావం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి పనులు మూడు అడుగులు ముందుకు -ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎస్డీపీ పథకాన్ని హెచ్ సిటీ ప్రాజెక్టుగా మార్చింది.
సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : ఈ నేపథ్యంలోనే పేరు మార్పులో ఉన్న శ్రద్ధ..పనులను శరవేగంగా పూర్తి చేయడంలో విఫలం చెందింది. గడిచిన రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పురోగతిలో ఉన్న మొదటి దశ పనులను పూర్తి చేయలేక పోగా..రెండో దశ పనులను పూర్తి స్థాయిలో పట్టాలెక్కించ లేదు. మొదటి దశ పురోగతిలో ఉన్న ఏ ఒక్క చోట పూర్తి చేయలేక పోవడం, రెండో దశలో 57.401 కిలోమీటర్లలో రూ.667.28కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించి ఇప్పటికీ చాలా వరకు టెండర్ల దశలోనే కాలయాపన చేస్తున్న తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఈ సారి వరద ముంపు తప్పదా?
ఏటా వర్షాకాలం వస్తోందంటే చాలు నగర వాసుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి..గడిచిన రెండేళ్లలో వరద ముంపుతో ఉక్కిరిబిక్కిరైన లోతట్టు, కాలనీ వాసుల భయాన్ని తొలగించాల్సిన అధికారులు నిర్లక్ష్యపు మత్తులో పనులను చేతులేత్తేశారు. కీలక నాలా విస్తరణ, బాక్స్ డ్రైన్ల నిర్మాణ పనులు చాలా ప్రాంతాల్లో అర్థాంతరంగా నిలిచిపోయాయి.
మరికొన్ని చోట్ల నాలాలు సగం తవ్వి వదిలేయడం, ప్రధాన నాలాల అనుసంధాన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇబ్బందులకు గురి చేసే అంశం. చేసిన పనులకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించడం లేదని , పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేపడతామంటూ కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. పనులను చకచకా పూర్తి చేసేందుకు అనుకూలమైన ఈ వేసవిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం వర్షాకాలం వచ్చిన దరిమిలా మళ్లీ అదే వరద, ఆదే సమస్య అన్నట్లుగా స్థానికుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నది.