సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): అట్టహాసపు ప్రకటనలు, అర్ధరహితపు శంకుస్థాపనలతో కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు గడిపింది. ఇక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన హడావుడి కూడా ప్రచారానికి సరిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్లో కీలకపాత్రను పోషించే హెచ్ఎండీఏ, మెట్రో, జీహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖల్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ సర్కారచ్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను మాత్రమే కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించడమే తప్ప కొత్తగా సిద్ధం చేసిన ఏ ఒక్క ప్రణాళికలనూ పట్టాలెక్కించింది లేదు. దీంతో చేతి నిండా ప్రతిపాదనలతో, అత్తెసరు పురోగతితో రేవంత్ సర్కార్ నగరాభివృద్ధికి అపోసోపాలు పడుతోంది.
ఎక్కడవేసిన గొంగలి అక్కడే..
చేతిలో డబ్బుల్లేవు, వచ్చే ఆదాయంలో మార్పు లేదు. ఇక రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన రియల్ ఎస్టేట్ రంగం చతికిల పడటంతో నగరం అభివృద్ధిలో వెనుకబడిపోతోంది. మిగతా మెట్రో నగరాలతో పోల్చితే ఒకప్పుడు రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల రంగంలో అత్యంత వేగంగా విస్తరించిన హైదరాబాద్ ఖ్యాతి.. గడిచిన 23 నెలల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించి, ఈ ప్రాజెక్టులకు తామే బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే ప్రతిపాదనలకు కూడా తట్టెడు మట్టి తీసింది లేదు. కానీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. వాటిని అధ్యయనం పేరిట పక్కన పెట్టి, నిధుల సమీకరణ కోసం దిక్కులు చూస్తున్న సర్కార్ కనీసం ఇప్పటివరకు ప్రకటించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు భూసేకరణ కూడా సంపూర్ణంగా చేసింది లేదు.
చేతి నిండా ప్రాజెక్టులు…
హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్రను పోషించే బల్దియా, హెచ్ఎండీఏ, మెట్రో సంస్థల విభాగాల్లో రూ.వేల కోట్ల ప్రాజెక్టులు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. ముఖ్యంగా నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచే ఎలివేటెడ్, మెట్రో విస్తరణ, ఇతర రవాణా సదుపాయాలు కూడా ఇప్పటికే ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండీఏ పరిధిలో గ్లోబల్ సిటీ సొబగులనిచ్చే కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, రేడియల్ రోడ్లతోపాటు, శివారుల వరకు రియల్ వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యంగా చేపట్టిన ల్యాండ్ ఫూలింగ్, కోర్ సిటీపై జనాభా భారాన్ని తగ్గించేలా ప్రతిపాదించిన శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం వంటి ప్రాజెక్టులతోపాటు, కోర్ సిటీలో ఫ్లైఓవర్లు,
అండర్ పాసులు, స్కై వాక్ వేలు ఇలా హెచ్ఎండీఏలో రూ. 15వేల కోట్ల ప్రతిపాదనలు, మెట్రో పరిధిలో మరో రూ.45వేల కోట్ల ప్రాజెక్టులు, మూసీ ప్రక్షాళన పేరిట మరో రూ.లక్షన్నర కోట్ల ప్రాజెక్టులు ఉంటే, బల్దియా ఆధీనంలో మరో రూ.10వేల కోట్ల ప్రాజెక్టులలో శంకుస్థాపనలు చేసి, భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన విలువ రూ.15వేల కోట్లు మేర ఉంది. కానీ వీటిల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కార్యారూపంలోకి రాలేదు. కనీసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలన్నరలోపే శంకుస్థాపన చేసిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణ కూడా ఇప్పటికీ పూర్తి చేయలేకపోయింది.
ప్రచారానికే పరిమితమైన సర్కార్..
నగరంలో గడిచిన రెండేళ్లుగా ఓవైపు కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి ప్రతిపాదనల పేరిట విస్తృత ప్రచారం చేసుకుంటోంది. మరోవైపు వాటిని కార్యారూపంలోకి తీసుకురావడానికి నిధుల కొరత వేధిస్తోంది. ఉదాహరణకు.. హెచ్ఎండీఏ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రేడియల్ రోడ్ల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్‌తోపాటు, ల్యాండ్ ఫూలింగ్ వంటి ప్రాజెక్టులకు భారీ స్థాయిలో నిధులు అవసరం. వీటిని సేకరించేందుకు భూముల వేలం, ఆస్తుల తనఖా వంటి కార్యాకలాపాలకు చొరవ తీసుకున్నా… ప్రణాళికలు పట్టాలెక్కించడమే గగనంగా మారింది.
ఇక నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుందంటూ గొప్పలు చెప్పుకునే హెచ్ఎండీఏ కమిషనర్ నుంచి ముఖ్యమంత్రి వరకు తాజాగా జరిగిన భూముల వేలం ద్వారా వచ్చిన ఆదాయ ఫలితాలతో నోరుతెరిచే పరిస్థితి లేకుండా పోయింది. 500 కోట్ల ఆదాయం అంచనా వేస్తే అందులో పది శాతం కూడా రెవెన్యూ సృష్టించలేకపోయింది. కానీ ప్రాజెక్టుల పేరిట విస్తృత ప్రచారం చేయడం, పనుల్లో పురోగతి లేకుండా వదలివేయడంలో రెండేళ్లలో కాంగ్రెస్ సర్కారు విజయం సాధించిందనే అభిప్రాయం జనాల్లో వ్యక్తం అవుతోంది.