పహడిషరీఫ్, ఏప్రిల్ 6 : డబ్బుల కోసం తరచూ డిమాం డ్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడుతుండడంతో.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న స్నేహితులు కోపంతో కత్తితో స్నేహితుడిని హత్య చేశారు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాల ప్రకారం.. పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాది ఏ సాలనీ కాలనీకి చెందిన మహ్మద్ నాసీర్ (22) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. నసీర్‌కు స్థానికంగా నివసించే దస్తగిరి, ఇలియాస్, సహాన్, నదీన్ స్నేహితులు.
నసీర్ తరుచుగా స్నేహితుల వద్ద అవసరాలకు డబ్బులు తీసుకుంటుంటా డు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆ ఐదుగురు స్నేహితులు మద్యం సేవించారు. అనంతరం నసీర్.. స్నేహితుల వద్ద డబ్బులు డిమాండ్ చేసి.. ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కత్తితో బెదిరించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న స్నేహితులు.. డబ్బుల కోసం బెదిరిస్తుండడంతో నసీర్ చేతిలో ఉన్న కత్తిని తీసుకుని అతడిపై దాడి చేశారు.
రక్తం మడుగులో ఉన్న నసీర్ తలపై మరోసారి దాడి చేయడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఇన్స్పెక్టర్ తెలిపారు