సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): అధికారికంగా ఎలాంటి కరెంటు కోతలు లేకపోయినా.. సబ్ స్టేషన్లలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఉన్నా… క్షేత్ర స్థాయిలో సరఫరాలో అంతరాయాలు నిత్యకృత్యంగా మారాయి. సబ్ స్టేషన్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల (డీటీఆర్)ల వరకు వెళ్లే 11 కేవీ విద్యుత్ లైన్లు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఇండ్లకు వెళ్తున్న ఎల్టీ లైన్లలో ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.
స్థానికంగా అకస్మాత్తుగా సరఫరా నిలిచిపోతే దాని పునరుద్ధరించేందుకు సిబ్బంది గంటల తరబడి సమయం తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. సకాలంలో క్షేత్ర స్థాయిలోని 11 కేవీ, ఎల్టీ లైన్లను పరిశీలించి..మరమ్మతులు చేయకపోవడంతోనే తరచూ కరెంటు సరఫరా నిలిచిపోతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి.. ఎప్పటికప్పుడు లైన్లను పరిశీలించకుండా సబ్స్టేషన్లు, సెక్షన్ కార్యాలయాలు, డీఈ, కార్పొరేట్ కార్యాలయాల్లోనే ఎక్కువ సమయంలో గడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
సెక్షన్ల వారీగా ఆపరేషన్స్ విభాగం అధికారులు విద్యుత్ లైన్ల నిర్వహణ విషయంలో ప్రణాళికాబద్దంగా తనిఖీలు చేసి లైన్లు దెబ్బతినే అవకాశం ఉన్న చోట వాటిని మార్చాల్సి ఉన్నా, అటు వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. కేవలం విద్యుత్ లైన్లు తెగినప్పుడు, చెట్లు, వాటి కొమ్మలు మీద పడినప్పుడు, ఇతర కారణాలతో లైన్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోతేనే సిబ్బంది స్పందించి మరమ్మతులు చేస్తున్నారు. గత వారం రోజులుగా గ్రేటర్ పరిధిలో 9 సర్కిళ్లలో ఎక్కడ చూసినా..
11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలోఅంతరాయం ఏర్పడిందని, దాన్ని సరి చేసేందుకు కొంత సమయం పడుతున్నదని ట్విట్టర్ వేదికగా సర్కిళ్ల అధికారులు, డీఈ స్థాయి అధికారులు సమాచారాన్ని పోస్టు చేశారు. ఇలా అధికారులు చేసే పోస్టులే నిత్యం పదికి మించి ఉంటున్నాయని, దీన్ని బట్టే నిర్వహణ, మరమ్మతు తీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతున్నదని విద్యుత్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక విద్యుత్ వినియోగదారులు చేసే ఫిర్యాదులు సెక్షన్ల వారీగా చూసినా పదుల సంఖ్యలో ఉంటే, ఒక సర్కిల్ పరిధిలో తీసుకుంటే అంతకు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.
క్షేత్ర స్థాయిలో విద్యుత్ లైన్లలో తలెత్తున్న సమస్యలను గుర్తించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. వచ్చే సోమవారం నుంచి ప్రతి విద్యుత్ స్తంభం నుంచి వెళ్లే విద్యుత్ లైన్ల పరిస్థితి ఎలా ఉంది..? ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్యూజ్ బాక్సులు, ఇతర కేబుళ్లు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. ఇదంతా మొక్కుబడిగా కాకుండా 9 సర్కిళ్ల పరిధిలో ఉండే ప్రతి స్తంభం వద్దకు వెళ్లి పూర్తి వివరాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.
క్షేత్ర స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజినీర్ నుంచి మొదలుకొని ఆర్టిజన్ వరకు తిరిగి విద్యుత్ వినియోగదారులను కలుసుకొని సమస్యలను తెలుసుకునే ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. కొత్తగా చేపడుతున్న క్షేత్ర స్థాయి పరిశీలనతో 11 కేవీ లైన్లలో ప్రతి అంశాన్ని పరిశీలించి.. వివరాలను నమోదు చేయనున్నారు. ఆదేవిధంగా ఎల్టీ, 33 కేవీ లైన్లను పరిశీలించి సమస్యలు ఎక్కడ వస్తున్నాయో గుర్తించనున్నారు. మొత్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని ఎస్ఈలకు సీఎండీ ఆదేశించారు.