Hyderabad Metro | సిటీబ్యూరో: దేశంలోనే సమర్థవంతమైన మెట్రో వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ మెట్రోకు ఇప్పుడు తలంపులు తప్పడం లేదు. ఎల్ అండ్ టీ నిర్వహణ లోపమో, లేక అధికారుల పర్యవేక్షణ వైఫ్యలమో తెలియదు కానీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. తొందరగా వెళ్లేందుకు మెట్రో ఎక్కితే.. ఎప్పుడూ ఆగిపోతుందనే భయమే తరచూగా మెట్రోలో ప్రయాణించే వారికి ఎదురవుతున్నది. నెలకోసారి ఏదో ఒక మార్గంలో ఒక్కసారిగా నిలిచిపోవడంతో రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గతంలోనే తరచుగా వస్తున్న బ్రేక్ డౌన్ సమస్యలను పరిష్కరించేలా నిర్వహణ అధ్యయనం చేసినా.. అధ్యయనం తర్వాత చేపట్టాల్సిన విషయంపై దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్యలకు కారణమని తెలుస్తోంది.
పేరుకే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం
పేరుకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెబుతున్నా… మెట్రోకు నిత్యం ఎదురయ్యే టెక్నికల్ సమస్యలు హెచ్ఎంఆర్ఎల్ పరువు పోయేలా చేస్తోంది. తరచుగా ఆకస్మిక నిలిపివేతలతో ప్రయాణికులు భయపడిపోతున్నారు. ముఖ్యంగా పీక్ అవర్లో సిగ్నలింగ్ వ్యవస్థలో తలెతుతున్న సాంకేతిక లోపాలతో బోగీల్లో ప్రయాణికులు బంధీ అవుతున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో కరెంట్ సరఫరా అంతరాయం, ప్యాసింజర్ లోడ్ అధికంగా ఉండటంతో ఎప్పుడు నిలిచిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది.
ఏడాది కాలంగా
గడిచిన ఏడాది కాలంగా నగరంలో పలుమార్లు మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. గతేడాది మార్చి 27న నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్తున్న మెట్రో సర్వీసు జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు రాగానే నిలిచిపోయింది. దాదాపు 15 నిమిషాల పాటు సేవలు ఆగిపోయాయి. రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడంలో వచ్చిన సమస్యల కారణంగా జూన్ నెలలో ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్లు తీసుకుని బోగీల నుంచి బయటకు వచ్చారు.
హఠాత్తుగా నవంబర్ 11న తలెత్తిన టెక్నికల్ సమస్యలతో ఏకంగా అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డిసెంబర్ నెల్లలోనూ లక్డీకాపూల్, మలక్పేట వద్ద టెక్నికల్ సమస్యలు కారణంగా కొంత సేపు నిలిచిపోయింది. గతేడాది డిసెంబర్లో తలెత్తిన సమస్యలతో రెండున్నర గంటలపాటు నిలిచిపోవడం ప్రయాణికులు ఆందోళన చెందారు.
తాజాగా బుధవారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ – మియాపూర్ మార్గంలో నాంపల్లి దగ్గర ఒక్కసారిగా మెట్రో ఆగిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు మెట్రో బండి ఎటూ కదలకుండా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అదనపు బోగీలు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నా… మెట్రో సంస్థ బోగీల పెంపుపై దృష్టి పెట్టడం లేదు.