సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నేడు ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష
ఐదు జోన్లలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు
అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా హాల్ టికెట్ లింక్
సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నేడు ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష
ఐదు జోన్లలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు
అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా హాల్ టికెట్ లింక్..
సోషల్ మీడియా, స్థానిక పోలీస్ స్టేషన్లలోనూ సంప్రదించవచ్చు
సీవీ ఆనంద్
సిటీబ్యూరో, ఏప్రిల్ 4 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత శిక్షణ తరగతుల ఎంపిక కోసం మంగళవారం పోటీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో ఐదు జోన్లలో ఉచిత శిక్షణకు 21 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఉచిత శిక్షణకు అర్హత సాధించే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 200 మార్కులకు గాను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు దారులందరికి హాల్ టిక్కెట్లు వారివారి ఫోన్లకు ఎస్ఎంఎస్ లింక్ ద్వారా పంపించినట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్, సిటీ పోలీస్‌కు సంబంధించిన ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లలోనూ సంప్రదించవచ్చని సూచించారు. అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, హాల్ టికెట్‌తో పాటు వాటర్ బాటిల్, మాస్క్‌ను తప్పని సరిగా తెచ్చుకోవాలని నగర పోలీస్ పరిపాలనా విభాగం జాయింట్ సీపీ రమేష్ రెడ్డి తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
పోలీస్ కావాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్న యువత నేడు నిర్వహించబోయే అర్హత పరీక్షలో పాల్గొనాలి. శిక్షణ సమయంలో క్రమశిక్షణతో మెలుగుతూ నిపుణుల సూచనలతో లక్ష్యం వైపు ముందుకు సాగాలి. పేదలకు కోచింగ్ భారం కాకూడదన్న ఉద్దేశంతో నగర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఎంపిక చేసిన అభ్యర్థులందరికీ శిక్షణ తరగతులను ప్రారంభిస్తాం. శిక్షణతోపాటు ఎప్పటికప్పుడు వారి ప్రతిభను గుర్తించేందుకు మాక్ టెస్టులు నిర్వహిస్తాం. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులందరూ నూటికి నూరు శాతం విజయం సాధించేలా ప్రత్యేక తర్ఫీదును ఇవ్వబోతున్నాం.
– సీవీ ఆనంద్, నగర పోలీస్ కమిషనర్, హైదరాబాద్
ఐదు జోన్లు.. 36 పరీక్షా కేంద్రాలు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో కలిపి సుమారు 36 కేంద్రాలను అర్హత పరీక్షకు సిద్ధం చేశారు.
నార్త్‌జోన్‌లో పరీక్షా కేంద్రాలు..
వెస్ట్ మారేడ్‌పల్లి కస్తుర్బా కాలేజీ, బాలంరాయి ప్రభుత్వ పీజీ కాలేజీ, బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సికింద్రాబాద్ ఆర్జీఆర్ సిద్ధాంతి కళాశాల, లాలాగూడ వనిత కళాశాల, ప్యాటీ చౌరస్తా ఎస్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాల.
వెస్ట్‌జోన్‌లో..
మెహిదీపట్నం నారాయణ జూనియర్ కాలేజీ, టోలీచౌకి అజాం ఇంటర్నేషనల్ స్కూల్, మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మంగళ్‌హాట్ ఐమౌంట్ హైస్కూల్, మెహిదీపట్నం (న్యూ మల్లేపల్లి) అన్వర్ లూమ్ డిగ్రీ కళాశాల, గోషామహాల్ సీటీసీ, యూసుఫ్‌గూడ సెయింట్ మేరీ కళాశాల, అమీర్‌పేట కమ్మసంఘం, అమీర్‌పేట్ మహబూబ్ ప్రైడ్ ప్యాలెస్, అమీర్‌పేట్ మదర్ స్కూల్ అండ్ డిగ్రీ కాలేజీ
ఈస్ట్ జోన్..
కోఠి ఉమెన్స్ కాలేజీ, రాంకోఠిలోని ప్రగతి మహావిద్యాలయం, మలక్‌పేట్ వాణి కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ, ఇంజినీరింగ్ కళాశాల, ఠాగూర్ ఆడిటోరియం, పీజీఆర్ఆర్సీడీఈ, బీఎడ్ కాలేజ్, టెక్నికల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లా కాలేజీలు
సౌత్ జోన్..
చంపాపేట్ భరత్ గార్డెన్, తాడ్బంద్ లెగసీ ఫంక్షన్ హాల్, చంచల్‌గూడ ప్రభత్వ జూనియర్ కళాశాల, బండ్లగూడ అరోరా కాలేజీ, హుస్సేనీఆలం పాల్కి గార్డెన్స్, డబీర్‌పురా నవాబ్ షా ఆలంఖాన్ ప్రాంతాలు
సెంట్రల్ జోన్..
అబిడ్స్ అరోరా కాలేజీ, దోమలగూడ ఏవీ కళాశాల, చిక్కడపల్లి అరోరా కాలేజీ
రాచకొండలో ఉచిత పోలీసు శిక్షణ శిబిరం
దరఖాస్తు గడువు ఏప్రిల్ 7వరకు పొడిగింపు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న యువతీ యువకులకు ఉచిత శిక్షణను అందిస్తున్న క్యాంప్‌లో చేరేందుకు విధించిన గడువును ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీ వరకు పెంచారు. 7వ తేది సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు సంబంధించిన వెబ్సైట్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఇతర సోషల్ మీడియాలో ఉచిత శిక్షణ శిబిరం ప్రకటనకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. లేదా స్థానిక పోలీసు స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.