వెంగళరావునగర్, మే 17 : హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.5 లక్షలకు టోకరా వేసింది ఓ కిలాడి లేడి. ఎస్ఐ శివ శంకర్ కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసం ఉండే జీవన్ విజేందర్ 2022లో ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు టైలరింగ్ షాపు నిర్వహించే తన అత్త ఉర్మిలాదేవి ద్వారా అంబర్ పేటకు చెందిన ప్రసన్నారెడ్డి అనే మహిళ పరిచయమైంది. తాను హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకుని పరిచయం చేసుకుంది. రూ.15 లక్షలు ఇస్తే హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉ ద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మి 2023 ఆగస్టు నెలలో రూ.6.5 లక్షలు ముట్టజెప్పారు. వారిని నమ్మించి మిగతా రూ.8.5 లక్షలు వసూలు చేయాలని పథకం వేసింది.
ఈ క్రమంలో శైలజారెడ్డి అనే మహిళను హైకోర్టు న్యాయమూర్తి అని చెప్పి పరిచయం చేసింది. అతడి అసిస్టెంట్ ఫిరోజ్ ఖాన్ అని చెప్పి వారిద్దరిని పరిచయం చేసింది. ఈ క్రమంలో రవి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రసన్నారెడ్డి చేతిలో మోసపోయనని.. తాను కూడా ఉద్యోగం కోసం ఆమెకు రూ.4.5 లక్షలు ఇచ్చినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. దీంతో ప్రసన్నారెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించిగా.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.