సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): అమెరికన్ ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ బీబీనగర్‌కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 1.64 కోట్లు కాజేశారు. బీబీనగర్‌కు చెందిన బాధితుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐరన్ఎఫ్ఎక్స్స్వీఐపీ.కామ్ పేరుతో ఒక వెబ్సైట్ కన్పించింది. ఆ వెబ్‌సైట్‌ను పరిశీలించడంతో స్టాక్ మార్కెట్లో ఎంతో అనుభవం ఉండి..పటిష్టమైన వ్యవస్థగా నిర్వాహకులు చెప్పుకొన్నారు.
దానిని నమ్మిన బాధితుడు ఆ వెబ్సైట్లో క్లిక్ చేసి తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంతో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఆ వెబ్సైట్ నిర్వాహకులు పంపించి వాట్సాప్ గ్రూప్‌లో బాధితుడి నెంబర్‌ను యాడ్ చేశారు. దీంతో తాను అడ్వయిజరీ రిఫ్రంజెంటేటివ్నంటూ చెప్పుకొని ఏదైనా ఉంటే వాట్సాప్‌కు మెసేజ్ చేయాలని, తాను ఎప్పటికప్పుడు మెలుకువలు చెబుతానంటూ నమ్మించాడు. దీంతో బాధితుడు తన బ్యాంకు ఖాతా వివరాలతో ఆ వెబ్సైట్లో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తరువాత ట్రేడింగ్ యాప్ అంటూ మరో లింక్‌ను ఇచ్చి యాప్‌ను డౌన్లోడ్ చేయించారు.
ఆ తరువాత బాధితుడు రూ. 43 వేలు పెట్టుబడి పెట్టడంతో దానిని యూఎస్డీటీలోకి మార్చి, బాధితుడికి రూ. 4250 లాభం వచ్చిందంటూ అతడి ఖాతాకు పంపించాడు. దంతో నమ్మకం ఏర్పడ్డ బాధితుడు లక్షల్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. దీంతో మీరు పెట్టే పెట్టుబడి యూఎస్ ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్‌లోకి మారుస్తామంటూ..మరింత పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు యూఎస్డీటీలో వస్తాయంటూ సైబర్‌నేరగాళ్లు నమ్మించారు. దీంతో ఐదారు దఫాలుగా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. స్క్రీన్‌పై సుమారు రూ. 3 లక్షల యూఎస్డీటీలతో మీ కౌంట్ నిండుగా ఉందంటూ సైబర్‌నేరగాళ్లు సూచించారు.
వాటిని విత్‌డ్రా చేసుకోవడానికి బాధితుడు ప్రయత్నించడంతో 20 శాతం పన్ను చెల్లించి విత్ డ్రా చేసుకోవాలంటూ సూచించడంతో రూ. 50 లక్షలు సైబర్నేరగాళ్లుచెప్పినట్లు ఆయా ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. అయితే రెండు గంటల్లో విత్‌డ్రా చేసుకోవచ్చంటూ సూచించిన సైబర్‌నేరగాళ్లు ఆ తరువాత స్క్రీన్‌పై నుంచి ఆ నంబర్లను తొలగించారు. అప్పటికే సైబర్‌నేరగాళ్లు చెప్పిన ఆయా ఖాతాల్లో బాధితుడు 1,66,97,500 డిపాజిట్ చేశాడు. లాభంగా అందులో రూ.1,93,138 బాధితుడి ఖాతాలో సైబర్‌నేరగాళ్లు క్రెడిట్ చేశారు. రూ. 1.64 కోట్లు మోసపోయానని, పక్కా ప్లాన్‌తో మోసం చేశారంటూ బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.