IT Jobs | సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలు దండుకున్న ఒక కిలాడీ లేడీని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 9 స్మార్ట్ఫోన్లు, 6 కీ ప్యాడ్ ఫోన్లు, ల్యాప్‌టాప్, 10 సిమ్‌కార్డులు, 6 చెక్ బుక్‌లు, 4 డెబిట్ కార్డులు, కారును స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేంద్రారెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన రేష్మ అలియాస్ స్వప్న 2009లో నగరానికి వలస వచ్చి, ఇన్స్టెంట్ ఐటీ జాబ్స్ కన్సల్టెన్సీలో టెలీకాలర్‌గా పనిచేసింది. అక్కడ మేనేజర్‌గా పనిచేసే మహ్మద్ అలీతో చనువు పెంచుకొని.. 2013లో అతడిని వివాహం చేసుకుని, 2022లో విడాకులు ఇచ్చింది.
అదే సంవత్సరంలో మరో పెళ్లి చేసుకున్న రేష్మ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే క్రమంలో మాజీ భర్తతో సంబంధాలు కొనసాగిస్తున్నది. నిరుద్యోగులే లక్ష్యంగా ఫోన్‌కాల్స్, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నది. ఈ క్రమంలోనే 2023 సెప్టెంబర్‌లో నగరానికి చెందిన ఓ యువతికి ఫోన్ చేసి తనను తాను కాగ్నిజెంట్‌లో సీనియర్ హెచ్ఆర్ మేనేజర్‌గా పరిచయం చేసుకుంది. మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలున్నట్లు తెలిపింది. ఇది నమ్మిన బాధితురాలు తనకు పరిచయం ఉన్న 9 మంది నిరుద్యోగుల రెస్యూమ్‌లను వాట్సాప్ ద్వారా నిందితురాలికి పంపింది.
అయితే అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే ఉద్యోగాలను ఇప్పిస్తామని సుప్రీతి అనే మరో యువతి బాధితురాలికి తెలిపింది. ఇది నమ్మిన బాధితురాలు 9 మంది వద్ద నుంచి మొత్తం రూ.58,75,000 సేకరించి నిందితులు సూచించిన పలు బ్యాంకు ఖాతాలకు పంపించింది. డబ్బులు అందిన వెంటనే బాధితుల వాట్సాప్‌నకు వివిధ కంపెనీల నుంచి జాబ్ ఆఫర్ లెటర్స్‌ను పంపించారు. దీంతో వచ్చిన ఆఫర్ లెటర్స్ నిజమైనవే అనుకుని బాధితులు ఆయా కంపెనీలకు వెళ్లగా అవి నకిలీవని తేలింది.
దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు గత నెల 1న సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరిపిన పోలీసులు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడీ రేష్మను సోమవారం అరెస్టు చేశారు. నిందితురాలిని గతంలో కూడా కర్ణాటక పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా రేష్మపై తెలంగాణలో 5 కేసులు, కర్ణాటకలో 6, ఏపీలో 1 కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలికి మాజీ భర్తతో పాటు ఆజిల్ పాటిల్, ఫిర్దోస్లు సహకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.