ఖైరతాబాద్, మార్చి 28: డెయిరీ ఫామ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలోస్తాయని నమ్మించి మోసగించారని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో చంపాపేట్ కు చెందిన మధు, శ్రీనగర్ కాలనీకి చెందిన కె. వెంకటేశ్వర్ రావు, ఎస్ఆర్ నగర్‌కు చెందిన సాంబశివరావులు తమను జరిగిన అన్యాయాన్ని వివరించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవించే తాము గత ఏడాది కొండపల్లి డెయిరీ ఫామ్ ప్రకటన చూసి ఆకర్షితులమయ్యామన్నారు.
తమ ఫామ్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారన్నారు. దీంతో కోకాపేటలో నివాసం ఉండే ఫామ్ డైరెక్టర్లు వేముల సుబ్బారావు, వేముల కుమారి, వేముల వర్షిత్, ఫండ్ రైజర్ కె. రెడ్పప్పలను కలిశామన్నారు. మోయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామం నాగిరెడ్డిగూడలో తమకు ఫామ్ ఉందని, అందులో 500 బర్రెలు ఉన్నాయని చెప్పారన్నారు. రూ.13లక్షలు పెట్టి 10 బర్రెలను సొంతం చేసుకోవచ్చని, వాటికి సంబంధించిన నిర్వహణ తామే చూసుకొని లాభాలు మాత్రం పెట్టుబడి పెట్టిన వారికి ఇస్తామని నమ్మబలికారన్నారు.
తమను స్వయంగా ఫామ్ కు తీసుకెళ్లి 500 బర్రెలను సైతం చూపించారన్నారు. వారి మాటలను నమ్మి రూ.15 లక్షల నుంచి రూ.39 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టామన్నారు. ఒకటి, రెండు నెలలు కొంత షేర్ ఇచ్చినా రాను రాను ఇవ్వడం మానేశారన్నారు. దీంతో తాము నాగిరెడ్డిగూడలోని ఫామ్‌కు వెళ్లి చూస్తే ఒక్క పశువు కూడా లేదన్నారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి మోయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటి వరకు బాధ్యులపై ఇంకా చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.