Hyderabad | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 20: కార్లను అగ్రిమెంట్ పద్ధతిలో అద్దెకు తీసుకుని వాటిని అమ్ముకుంటున్న వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాట చేసిన సమావేశంలో డీసీపీ సురేశ్ కుమార్, బాలానగర్ ఏసీపీ హన్మంత రావు, జగద్గిరిగుట్ట సీఐ నర్సింహా, డీఐ అంజయ్యలు వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అప్పరి విశ్వ ఫణీంద్ర గాజుల రామారం దేవేందర్ నగర్ చివకల రమణ, రెడ్డి వెంకటేశ్ లతో కలిసి వీవీఆర్ ట్రావెల్స్ పేరిట ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించాడు. విశ్వఫణీంద్ర జగద్గిరిగుట్టకు చెందిన శశిధర్ వద్ద 2024 అక్టోబర్ నెలలో అగ్రిమెంట్ పద్ధతిలో కారును అద్దెకు తీసుకుని నెలకు రూ.23 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అనుకన్న విధంగానే రెండు నెలలు సక్రమంగా అద్దె చెల్లించాడు. 2025 జనవరి నెలలో అద్దె ఇవ్వకపోగా రేపు, మాపంటూ నెట్టుకొస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన శశిధర్ విశ్వ ఫణీంద్ర కార్యాలయం వద్దకు వెళ్లగా, తాళం వేసి ఉంది. అక్కడ వాకబు చేయగా అతను ఇదే తరహాలో మరికొంత మందిని నమ్మించి బురిడీ కొట్టించినట్లు తెలిసింది. వెంటనే శశిధర్ ఈ విషయమై జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి విశ్వ ఫణీంద్రను అదుపులోకి తీసుకున్నారు.
విశ్వ ఫణీంద్ర ఇదే తరహాలో మొత్తం 32 కార్లను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ధరకు విక్రయించినట్లు పోలీసులు తెలుసుకుని రూ.2.5 కోట్ల విలువచేసే 28 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న రమణ, సత్యనారాయణ, వెంకటేష్‌లు పరారీలో ఉన్నారు. అప్పరి విశ్వ ఫణీంద్రను పోలీసులు గురువారం రిమాండుకు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ కె.నర్సింహ. డీఐ ఎం.అంజయ్య, ఎస్సై శంకర్, ఏఎస్సై రమణ, హెడ్ కానిస్టేబుల్ అంజిబాబు, పురందాస్, కానిస్టేబుళ్లు నరేశ్ కుమార్, చిరంజీవి, నరేశ్ లను డీసీపీ అభినందించి రివార్డులు అందజేసి అభినందించారు.