బంజారాహిల్స్, ఏప్రిల్ 14: విదేశాల్లో వర్కింగ్ వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీగా డబ్బులు దండుకుంటున్న ముఠాలోని ఇద్దరు కీలక సభ్యులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ట్రివియల్ చాఫ్టర్ పేరుతో ఢిల్లీతోపాటు పోర్చుగల్ తదితర దేశాల్లో నిరహిస్తున్న ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంస్థ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో కార్యాలయం ఏర్పాటు చేసింది.
ఈ సంస్థ ద్వారా గత కొంతకాలంగా యూరోప్‌లోని రుమేనియా, గ్రీస్, ఇటలీ, సెర్బియా తదితర దేశాల్లో పనిచేసేందుకు వీసాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తర్వాత నకిలీ ఆఫర్ లెటర్స్, బోగస్ వీసాలు ఇస్తున్నారు. నారాయణగూడకు చెందిన కరిష్మా అనే బాధితురాలితోపాటు మరో 10మంది నిరుద్యోగులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేశారు.
మణికొండలో నివాసం ఉండే ట్రివియల్ చాప్టర్ సంస్థ సౌత్ వైస్ ప్రెసిడెంట్ లంక నిరుపమ (26), ఎల్బీనగర్లో నివాసం ఉంటున్న తెలంగాణ రీజినల్ మేనేజర్ మామిడి అరుణ్‌రాజ్ (28)లను మంగళవారం అరెస్ట్ చేశారు. సంస్థకు చెందిన సీఈవోతోపాటు ఇతర ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు.