Hyderabad | బంజారాహిల్స్, మే 9 : పెళ్లి సంబంధం పేరుతో యువతిని పరిచయం చేసిన స్నేహితుడు అమెతో కలిసి పలు రకాలైన కారణాలతో డబ్బులు గుంజి మోసం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన నానీ కుమార్(42) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన పసుపులేటి తాతా శ్రీనివాస్ అనే స్నేహితుడున్నాడు. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న నానీ కుమార్ తనకు సరైన పెళ్లి సంబంధాలు రావడం లేదంటూ స్నేహితుడు తాతా శ్రీనివాస్‌కు చెప్పాడు. దీంతో తనకు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉన్న గెడ్డం శ్రావణి మణికొండలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోందని, ఆమెకు పరిచయం చేసి పెళ్లికి ఒప్పిస్తానని శ్రీనివాస్ నమ్మబలికాడు. కొన్నిరోజుల తర్వాత శ్రావణి ఫోన్ నెంబర్ ఇవ్వడంతో నానీకుమార్ అప్పటినుంచి ఆమెతో వాట్సప్ చాటింగ్ ప్రారంభించాడు.
ఇద్దరం కలిసి మాట్లాడుకుందామంటూ కోరడంతో రకరకాలైన సాకులు చెబుతూ చాటింగ్స్లోనే స్నేహాన్ని కొనసాగించింది. త్వరలోనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకుందామని నమ్మబలికింది. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రి పాలయ్యారని, వారి వైద్యం కోసం సాయం చేస్తే తర్వాత డబ్బులు తిరిగి ఇస్తానంటూ శ్రావణి కోరడంతో ఆమె సూచించిన పలు నెంబర్లకు సుమారు రూ.10లక్షల దాకా పంపించాడు. కాగా గత కొన్నిరోజులుగా నాని కుమార్ వాట్సప్ మెసేజీలకు స్పందించకపోవడంతో పాటు ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం లేదు. దీంతో స్నేహితుడు శ్రీనివాస్‌కు ఫోన్ చేయగా అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడం ప్రారంభమయింది. దీంతో తనను పెళ్లి సంబందం పేరుతో ఇద్దరూ కలిసి మోసం చేశారని బాధితుడు నానీ కుమార్ శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.