బంజారాహిల్స్,నవంబర్ 7: హోటల్ వ్యాపారంలో(Hotel business) పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తానంటూ నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్( Banjarahills) పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన నంది రాజేష్ అనే వ్యాపారికి ఇటీవల మహ్మద్ అబ్దుల్ ఖదీర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరం కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం 12లో ‘ఆర్ ఇన్ ’ పేరుతో హోటల్ పెడితే మంచి లాభాలు వస్తాయని ఖదీర్ నమ్మించడంతో రాజేష్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.6లక్షలు పెట్టుబడి పెట్టాడు. చెరో 50శాతం వాటా ఉంటుందని ఎంవోయూ చేసుకున్నారు. అయితే హోటల్ ప్రారంభించిన పదిహేనురోజులకే మూసేయడంతో పాటు రాజేష్ పెట్టిన రూ.6లక్షలకు అదనంగా 1.20లక్షలు కలిపి తిరిగి ఇస్తానంటూ ఖదీర్ హామీ ఇచ్చాడు.
అయితే నెలలు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఇటీవల ఆ హోటల్‌ను వేరే వ్యక్తులకు అమ్మే సుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం తనవద్ద తీసుకున్న డబ్బుతో హోటల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అధిక రేటుకు వేరే వాళ్లకు అమ్ముకుని తనను మోసం చేయడంతో పాటు తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడంటూ బాధితుడు రాజేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్ మీద బీఎన్ఎస్ 318(4) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.