Software Jobs | వెంగళరావునగర్, అక్టోబర్ 6: సాఫ్ట్వేర్ సంస్థల్లో బ్యాక్‌డోర్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి, మోసగించిన ఘటనపై మధురానగర్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన లక్ష్మీ కోటేశ్వరమ్మ మధురానగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ.. జాబ్ సెర్చింగ్ చేస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు స్నేహితుడైన శివకృష్ణ ద్వారా గచ్చిబౌలిలోని ఆరెంజ్ వీజీ హాస్టల్లో ఉండే వెంకటేశ్ పరిచయమయ్యాడు.
తాను సాఫ్ట్వేర్ సంస్థల్లో బ్యాక్‌డోర్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని వెంకటేశ్ నమ్మబలికాడు. అందుకు ఒక్కొక్కరు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతడి మాటలు నమ్మిన ఆమె ఆన్లైన్ ద్వారా రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేసింది. ఆమెతో పాటు ఆమె స్నేహితులు దాదాపు 20 మంది నుంచి కూడా రూ.3.3 లక్షలు వెంకటేశ్, అతడి సోదరుడు నిఖిల్ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు అపాయింట్మెంట్ లెటర్లు పంపారు.
ఆన్లైన్ ద్వారా పరీక్షలు రాయాల్సి ఉంటుందని చెప్పి.. ఓయో హోటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాడు. ఆ తర్వాత బాధితులు కంపెనీ వెబ్‌సైట్‌ను పరిశీలించగా.. ఈ పరీక్షలన్నీ మోసమని తేలింది. దీంతో బాధితులు తీసుకున్న డబ్బు ఇవ్వాలని పట్టుబట్టారు. ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.