Hyderabad | హైదరాబాద్‌లోని నాచారంలో మూడు రోజుల క్రితం జరిగిన పెయింటర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు లిఫ్ట్ ఇస్తామని ఓ పెయింటర్‌ను నలుగురు యువకులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి లైంగికంగా దాడి చేశారు. తమకు ఎదురుతిరగడంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. నాచారం ఠాణా పరిధిలో జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను సీఐ ధనుంజయ తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ కల్యాణపురికి చెందిన పెయింటర్ (45) ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జిల్లెలగూడలోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి 12.30 గంటలకు బయల్దేరాడు. ఒంటి గంట సమయంలో ఎల్బీ నగర్‌కు వచ్చిన అతను కల్యాణపురికి వెళ్లేందుకు వాహనం కోసం చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఓ కారును ఆపాడు. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు వస్తానని రిక్వెస్ట్ చేశాడు. ఆ కారులో నాచారం రాఘవేంద్ర నగర్‌కు చెందిన మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్ (18), షేక్ సైపుద్దీన్ (18), పొన్నా మణికంఠ (21), మల్లాపూర్‌కు చెందిన ఓ మైనర్ ఉన్నారు.
పెయింటర్‌ను కారు ఎక్కించుకున్నప్పటి నుంచి నలుగురు యువకులు అతడిని లైంగికంగా వేధించారు. పెయింటర్ సహకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. ఎన్జీఆర్ఐ వద్దకు వచ్చిన తర్వాత కారు స్లో అవ్వడంతో దూకి తప్పించుకోవడానికి విఫలయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. పెయింటర్‌ను పట్టుకుని తమ కారులో నలుగురు యువకులు నాచారం పారిశ్రామికవాడలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కత్తితో 8సార్లు పొడిచారు. అనంతరం పెయింటర్ చనిపోయి ఉంటాడని భావించి నలుగురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం 5.30 గంటల సమయంలో చలనం లేకుండా పడివున్న పెయింటర్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెయింటర్‌ను పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో తనను లైంగికంగా హింసించారని చెప్పి మరణించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టి నలుగురు యువకులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.