Hyderabad | కొండాపూర్, నవంబర్ 8 : క్రషర్ యంత్రానికి వెల్డింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టినాగులపల్లిలోని సపర్ణ క్రషర్ కంపనీలో వెస్ట్ బెంగాల్‌కి చెందిన రూపం సాహు(20), చంచల్ కమ్రి (19), సూరజ్ సింగ్(25), పూర్ణతరై(21)లు పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి క్రషర్ యంత్రానికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌తో వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ నలుగురిని ఉస్మానియా దవఖానకు తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.