జూబ్లీహిల్స్, నవంబర్ 9 : రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన శనివారం ఉదయం కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా కమలాపురం వద్ద చోటుచేసుకుంది. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన భార్గవ్‌కృష్ణ(55) హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్నారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలను చూసేందుకు కుటుంబ సమేతంగా భార్య సంగీత(45), కుమారుడు ఉత్తమ్ రాఘవ(28)లతో దత్తాత్రేయ గానుగాపూర్ క్షేత్రానికి వెళ్తున్నారు.
గుల్బర్గ జిల్లా కమలాపురం వద్దకు రాగానే ఎలాంటి డివైడర్లు లేకపోవడంతో ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టగా భార్గవ్‌కృష్ణ, భార్య సంగీత, కుమారుడు ఉత్తమ్ రాఘవలతో పాటు డ్రైవర్ రాఘవేందర్‌గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టాలని కర్ణాటక సరిహద్దు జిల్లా వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డిని డీజీపీ జితేందర్ ఆదేశించగా, ఎస్పీ దర్యాప్తులో గుల్బర్గ జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తులో ముందుకు సాగాలని కరణ్‌కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డిని ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కరణ్‌కోట్ పోలీసులు కర్ణాటక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించడమే కాకుండా బంధువులకు సమాచారమిచ్చి ఎఫ్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేశారు.