నాలుగు రోజుల్లో నాలుగు మరణాలు.. ఏ పాపం తెలియని అమాయకులను కరెంటు తీగలు బలిగొన్నాయి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం నగరవాసులకు ప్రాణసంకటంగా మారుతున్నది. బాధిత కుటుంబాలకు గుండె కోత మిగిలిస్తున్నది. ఇటీవల బండ్లగూడలో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మరణించిన ఘటన మరువకముందే.. తాజాగా కరెంటు తీగలు తగిలి.. అల్వాల్‌లో తండ్రీ కూతురు బలయ్యారు. కాగా, విద్యుత్ తీగలు తెగిపడినా.. ప్రాణాలు పోతున్నా.. అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు.. బాధిత కుటుంబాలను కనీసం మంత్రులు పరామర్శించిన పాపాన పోలేదు. ఇదిలా ఉంటే శుక్రవారం నగరంలో వర్షం బీభత్సం స్పష్టించింది. అల్వాల్‌లో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతిచెందగా, అత్తాపూర్ హైదర్‌గూడలో విద్యుత్ హెచ్చుతగ్గులతో ఇల్లు కాలిపోయింది. శంషాబాద్‌లో షాక్ తగిలి.. ఓ రైతుకు చెందిన నాలుగు గేదెలు చనిపోయాయి. పలు చోట్ల గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయి..జనం అవస్థలు పడ్డారు. నగరం అంధకారంలో మగ్గిపోయింది. జూన్ 9, 12, 13న కురిసిన వర్షాలతో 326 చెట్లు నేలకూలినట్లు అధికారులు తెలిపారు. విపత్తు సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నేరుగా విద్యుత్ తీగలు తాకవద్దని టీజీఎస్పీడీసీఎల్ సూచించింది.
-సిటీబ్యూరో, జూన్ 13(నమస్తే తెలంగాణ)
ఈనెల 9న బండ్లగూడ రాయల్ సీ హోటల్ వద్ద చాయ్ తాగేందుకు ఆటోలో దిగిన ఇద్దరు యువకులు ఆటోనుంచి దిగి కాలు రోడ్డుపై పెట్టగానే విద్యుదాఘాతంతో చనిపోయారు. ఇక్కడ వీధి స్తంభం, 11కేవీ స్తంభం రెండూ పక్కపక్కనే ఉన్నాయి. వాటిపై మూడురోజులుగా మంటలొస్తున్నాయని జీహెచ్ఎంసీకి స్థానికులు ఫిర్యాదు చేశారు. జూన్7న స్తంభానికి మరమ్మతు చేసి వీధిలైటును సరిచేసి టైమర్ అమర్చారు. కానీ మంటల గురించి మాత్రం పట్టించుకోలేదు. తర్వాతి రోజే గాలి దుమారంతో వీధిలైట్కు చెందిన ఓ తీగ తెగి రోడ్డుపై పడింది. సాయంత్రం ఆరుగంటలకు టైమర్ ఆన్ అయింది. అక్కడ అడుగు పెట్టగానే ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈనెల 12న అర్ధరాత్రి సమయంలో అల్వాల్ సమీపంలోని లాల్బజార్లో తండ్రీ కూతుళ్లు విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఎల్టీ కేబుల్ తెగి పడి ఉన్నది చూసుకోకపోవడంతో పాటు తమ కారును జరుపుదామంటూ వచ్చిన ఆ ఇద్దరు తీగ తగిలి బలయ్యారు. గాలిదుమారానికి చెట్టు కూలి ఎల్టీ కేబుల్‌పై పడడంతో ఆ కేబుల్ తెగి కారుపై పడిందని దీంతో ఎర్తింగ్ రాక ఫీజు కూడా పోలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులెవరైనా అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
నగరంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు విద్యుత్, మున్సిపల్ శాఖల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఘటనలు జరగడానికి కారణాలను విశ్లేషించాల్సిన అధికారులు, మంత్రులు తమ పనుల్లో తీరిక లేకుండా ఉండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఈ దారుణాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. చీకట్లో వెలుగులు నింపాల్సిన విద్యుత్ వ్యవస్థ.. నగరవాసుల ప్రాణాలు తీస్తోంది. వెలగని వీధిలైట్లు ఒకవైపు, విరిగిపడే స్తంభాలు, తెగిపడే విద్యుత్ తీగలు .. వెరసి నగర ప్రజలను బలితీసుకుంటున్నాయి. వర్షాకాలం వస్తే చాలు.. ప్రతీయేడాది ఒకరిద్దరు వీధిలైట్ల స్తంభాలు, తీగల వల్ల చనిపోతూనే ఉన్నారు.
ఈ నిర్లక్ష్యానికి బదులేది..!
ఆల్వాల్‌లో జరిగిన ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సంఘటనలో విద్యుత్ కేబుల్ తెగి కింద పడిన వెంటనే సర్క్యూట్ బ్రేక్ అయి ఫీడర్ మీద రిలే ప్రొటెక్షన్ ఆపరేట్ అయి కొన్ని సెకన్లలోనే ఫీడర్‌కు సైప్లె ఆగిపోవాలి. నగరంలో వరుసగా జరిగిన రెండు ఘటనల్లో రిలే ప్రొటెక్షన్ ఎందుకు పని చేయలేదని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కోట్లు పెట్టి కొన్ని విద్యుత్ పరిరక్షణ పరికరాలు పనికిరాకుండా పోయాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా సర్క్యూట్ బ్రేక్ అయిన వెంటనే ఎవరైనా ఆ తెగిన కండక్టర్‌తో టచ్‌లోకి వచ్చినా వారికి తగిలే షాక్ ఆ వ్యక్తికి ప్రాణహాని జరగకుండా ఉండేలా అంతే వేగంగా రెప్పపాటు సమయంలో సైప్లె ఆగిపోవాలి. కానీ ఈ రెండు ఘటనల్లో విద్యుత్ తీగల కారణంగానే మృతి చెందినట్లు తెలుస్తోంది. విద్యుత్, మున్సిపల్ ఇంజినీర్ల నిర్లక్ష్యంతో రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఇంత జరిగినా జీహెచ్ఎంసీ అధికారుల్లో ఎలాంటి స్పందన కనిపించలేదు. ప్రకృతి విపత్తుగా భావిస్తూ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా కనీసం విచారణ చేయకుండా కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్లక్ష్యం చేశారనే విమర్శలొస్తున్నాయి.
సామాన్యుల చావులు ప్రభుత్వానికి పట్టవా..!
గత నాలుగురోజుల్లో నగరంలో నలుగురు విద్యుత్ షాక్‌కు గురై మరణిస్తే ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రకటన లేదు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ క్యూర్ రీజియన్ పరిధిలో హైఅలర్ట్‌గా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. నగరంలో జరిగిన విద్యుత్ మరణాలపై సీఎం తన ప్రకటనలో కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇన్చార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ , విద్యుత్ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం మాట మాట్లడటం లేదు. కనీసం తన సోషల్మీడియాలోనైనా విద్యుత్ షాక్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి కూడా తెలపనంత తీరికలేకుండా భట్టి ఉన్నారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రుల తీరు ఇలా ఉంటే అధికారులు సైతం క్షణంపాటు తీరిక లేకుండా ఉన్నారు. రెండు ఘటనలకు ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యమే కారణం కాగా వీటికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం కానీ, అధికారులు కానీ సంఘటనాస్థలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. స్థానిక ఎలక్ట్రిసిటీ అధికారులు తమ పరిధిలో జరిగిన ప్రమాదాలపై తమకు సంబంధమే లేదన్నట్లుగా చెప్పుకొంటూ.. ఏదైనా ప్రకటన ఇవ్వాలంటే తమ ఉన్నతాధికారులను అడగాలంటూ పక్కకు తప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు ఉదంతాలపై స్పందించవలసిన ఉన్నతాధికారులు సైతం సమీక్షలు, సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప బాధితుల పక్షాన మాట్లాడిందే లేదంటూ నగరవాసులు మండిపడుతున్నారు.
కేసీఆర్ హయాంలో ముందస్తు సమీక్షలు..!
గతంలో వర్షాకాలం ప్రారంభానికి ముందే నాటి సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖతో సమీక్ష చేసి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం జరిగేది. ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా, కరెంట్ సరఫరా నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు ఆనాటి పరిస్థితులను బట్టి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసేవారు. నగరవాసులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. విద్యుత్శాఖామంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం తాము చేస్తున్న కొనుగోళ్ల వ్యవహారాలపై మాట్లాడడమే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షలు జరిపినట్లు దాఖలాలు లేవు.