మలక్‌పేట, నవంబర్ 6 : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మూడోరోజు నల్లగొండ చౌరస్తాలోని సర్కిల్-6 డీసీ కార్యాలయం వద్ద మలక్‌పేట నియోజకవర్గ నామినేషన్ కేంద్రం-58 ఏసీ లో మూడోరోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, చార్మినార్ పంజేషాకు చెందిన అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల సోమవారం మలక్‌పేట నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఒక్క నామినేషన్ సెట్ నామినేషన్ దాఖలు చేయగా, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీకి చెందిన కె.భార్గవి కజ్జయం, అక్బర్‌బాగ్ డివిజన్ ఆనంద్‌నగర్‌కు చెందిన ఎల్.అశోక్‌నాథ్, పాత మలక్‌పేట డివిజన్‌కు చెందిన పొల్కం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మహ్మద్ అక్రం అలీఖాన్ రెండోసెట్ నామినేషన్ వేశారు. ఆబాది పార్టీకి చెందిన సయ్యద్ అలీరాజ్, కొప్పుల సోమశేఖర్ నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారని, సోమవారం వరకు మొత్తం 39 మంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లినట్లు ఆర్ఓ వెంకట ఉపేందర్ర్రెడ్డి తెలిపారు.
భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు
చాదర్‌ఘాట్, నవంబర్ 6 :మలక్‌పేట నియోజకవర్గం ఎంఐఎం అభ్యర్థి అహ్మద్ బలాల భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. మలక్‌పేటలోని జలాల్ స్వీట్ హౌస్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ రేస్‌కోర్స్ రోడ్డు, మలక్‌పేట మున్సిపల్ కాలనీ, రిలయన్స్ డిజిటల్, మహబూబ్ మాన్షన్ మార్కెట్, డీ మార్ట్ లేన్, అక్బర్‌బాగ్ చౌరస్తా, నుంచి ఫైర్ స్టేషన్ రోడ్డు నుంచి చంచల్‌గూడ సబ్‌స్టేషన్, చంచల్‌గూడ జైల్ నుంచి జూనియర్ కాలేజీ, డబీర్‌పురా బ్రిడ్జి, టీబీ దవాఖాన, చంచల్‌గూడ నయా సడక్ రోడ్డు, న్యూ మలక్‌పేట, ఆజంపురా ఆర్యూబీ, షహీఫా మసీదు, చాదర్‌ఘాట్ మీదుగా నల్లగొండ చౌరస్తాలోని మలక్‌పేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నామినేషన్ ర్యాలీ నాలుగు గంటల పాటు కొనసాగింది.
యాకుత్‌పురలో రెండు నామినేషన్లు
సైదాబాద్, నవంబర్ 6 : ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో సోమవారం యాకుత్‌పురలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. చంపాపేటలోని యాకుత్‌పుర ఆర్వో కార్యాలయానికి ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న జాఫర్ హుస్సేన్ మెరాజ్ తన అనుచరులతో ర్యాలీ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. విద్యార్ధుల రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎన్. అనిల్‌కుమార్ తన నామినేషన్లను దాఖలు చేశారు. ఇరువురు అభ్యర్థులు తమ నామినేషన్ల పత్రాలను యాకుత్‌పుర ఆర్వో ఈ.వెంకటా చారికి అందజేశారు. అభ్యర్థులు తమ బీ ఫాంలను సమర్పించి నామినేషన్ల వేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పుటి నుంచి ఇప్పటికి యాకుత్‌పుర నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, ఒక మజ్లిస్ పార్టీ తరుపున, మరొకరు విద్యార్థి రాజకీయ పార్టీ తరుపున నామినేషన్లు వేశారు.