హబ్సిగూడ: హైదరాబాద్ హబ్సిగూడలో (Habsiguda) విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణం చెందారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ముకురాళ్లకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి (44), కవిత (35) దంపతులు హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో గత కన్నేండ్లుగా నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె శ్రీత రెడ్డి (15), కుమారుడు విశ్వాన్ (10) ఉన్నారు. శ్రీత 9వ తరగతి చదువుతుండగా, విశ్వాన్ ఐదో తరగతి చదువుతున్నారు. చంద్రశేఖర్.. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేసేవారు. ఇటీవల ఆ ఉద్యోగం మానేశారు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో కుమారుడు విశ్వాన్‌రెడ్డి విషమిచ్చి, కూతురు శ్రీతకి ఉరేసి చంపేశారని అనుమానిస్తున్నారు. పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్నాక చంద్రశేఖర్ రెడ్డి, కవిత ఇంట్లోని పక్క పక్క గదుల్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు. అనుమానాస్పద మరణాలు కేసు నమోదుచేసిన ఓయూ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
అయితే ఘటనా స్థలంలో సూసైట్ నోట్ లభించినట్లు తెలుస్తున్నది. ‘నా చావుకి ఎవరూ కారణం కాదు. వేరు మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించండి. కేరీర్లోనూ, శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా. మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నా’ అని చంద్రశేఖర్ రెడ్డి అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.