సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘అక్యూట్ టైప్-ఏ ఆర్టిక్ డిసెక్షన్’ బాధితులకు సకాలంలో శస్త్రచికిత్స చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని సజ్జ ఫౌండేషన్ చైర్మన్, స్టార్ హాస్పటల్ కార్డియోథొరాసిక్ సర్జన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ లోకేశ్వర్‌రెడ్డి సజ్జ తెలిపారు. దీనిపై సజ్జ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ సర్వే ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ థొరాసిక్ అండ్ కార్డియోవాస్కులర్ సర్జరీ-2025’ అక్టోబర్ సంచికలో ప్రచురితమైందని ఆయన వెల్లడించారు.
ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అక్యూట్ టైప్-ఏ ఆర్టిక్ డిసెక్షన్ కేసులకు చికిత్స అందించడం ద్వారా గణనీయమైన తేడాలు ఉన్నట్లు వెల్లడించింది. ఆర్టిక్ డిసెక్షన్ బాధితులకు కొన్ని దవాఖానల్లో అధునాతన శస్త్ర చికిత్స అందిస్తుండగా మరికొన్ని పరిమిత, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆలస్యంగా రోగ నిర్ధ్దారణ జరగడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. దీనికి ప్రత్యేక కార్డియాక్ కేంద్రాల్లో సకాలంలో శస్త్రచికిత్స చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తేలిందన్నారు. సజ్జ హార్ట్ ఫౌండేషన్ ద్వారా దేశమంతటా అవగాహన కల్పించడంలో డాక్టర్ లోకేశ్వరరావు విశేష కృషి చేస్తున్నారు.
లక్ష మందిలో 5 నుంచి 6 కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి లక్ష మందిలో 3 నుంచి 6 వరకు ఆర్టిక్ డిసెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం భారత దేశంలో ఏటా ప్రతి లక్ష మందిలో 5 నుంచి 6 కేసులు సంభవిస్తున్నట్లు తేలింది. దురదృష్టవశాత్తు చాలా కేసులను సరైన నిర్ధారణ లేకపోవడం లేదా గుండెపోటు, పక్షవాతంగా తేలుస్తున్నారు. అధిక రక్తపోటు ఈ అపస్థితికి ప్రధాన కారణమవుతున్నది. అకస్మాత్తుగా వచ్చే ఛాతీ నొప్పి, తీవ్రమైన వెన్నునొప్పి, మూర్ఛవంటి సంకేతాలు దీనికి కారణాలు. శస్త్ర చికిత్స ద్వారానే ఆర్టిక్ డిసెక్షన్ బాధితుల ప్రాణాలు రక్షించే ఏకైక మార్గమని వైద్యులు తెలుపుతున్నారు.
గుండెపోటు లేదా పక్షవాతం మాదిరిగానే ఆర్టిక్ డిసెక్షన్ గురించి సాధారణ ప్రజలకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఇది కూడా అత్యంత ప్రమాదకరమే. ఈ పరిస్థితిపై అవగాహన, లక్షణాలను త్వరగా గుర్తించడం, కార్డియాక్ సర్జరీ కేంద్రానికి తక్షణమే చేరుకోవడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని డాక్టర్ లోకేశ్వర్‌రావు సజ్జ సూచించారు. ఫ్రోజెన్ ఎలిఫెంట్ ట్రంక్ వంటి అధునాతన చికిత్స విధానాలతో చాలామంది రోగులు కోలుకొని ఆరోగ్యమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని వెల్లడించారు.