వచ్చే నెల 11న నిర్వహించనున్న ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కు నగరంలో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. దేశంలోనే మొదటిసారిగా జరగనున్న ఈ పోటీలకు బుక్ మై షోలో టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్ బుధవారం హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో తొలి టికెట్ కొనుక్కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని టాప్ 25 నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపకల్పన చేసి సమర్థవంతంగా అమలు చేస్తున్నదని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 23 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. కాగా, 2.8 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఫార్ములా రేసింగ్ ట్రాక్ చుట్టూ 25వేల మంది కూర్చునేలా సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 22,500 టికెట్లను ఆన్లైన్లో విక్రయించనున్నారు.
– సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ):
ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ కార్ల పోటీలకు.. బుధవారం హైటెక్స్‌లో తొలి టికెట్ కొనుక్కొని టికెట్ విక్రయాలను ప్రారంభించిన రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మెట్రో పాలిటన్ కమిషనర్ అర్వింద్‌కుమార్. చిత్రంలో ఆయనతో పాటు ఏస్ నెక్ట్ జెన్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, ఏస్ నెక్ట్ జెన్ సీఈఓ దిల్బాగ్ జిల్, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అక్బర్ ఇబ్రహీం తదితరులు
సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో ఫార్ములా -ఈ కార్లు రేసింగ్‌తో సందడి చేయనున్నాయి. దేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా -ఈ కార్ రేసింగ్ పోటీలు వచ్చే నెల ఫిబ్రవరి 11న జరగనున్నాయి.పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్ల విక్రయాన్ని బుధవారం హైటెక్స్‌లోని హాల్ 1లో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వాహకులతో కలిసి కో స్పాన్సర్‌గా ఉన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మెట్రో పాలిటన్ కమిషనర్ ఆర్వింద్‌కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు మొదటి టికెట్‌ను ఆన్లైన్లో ఆర్వింద్‌కుమార్ కొనుగోలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మహానగరం ఒకటన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యుత్ వాహన రంగాన్ని ప్రోత్సహించేందుకు నగరంలో ఫిబ్రవరి 5-11 వరకు ఈ మొబిలిటీ వీక్‌ను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. పూర్తిగా కాలుష్య రహిత మోటార్లతో కూడిన రేసింగ్ కార్లు ఈ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆన్లైన్ టికెట్ విక్రయాల కొనుగోలును ఏస్ నెక్ట్ జెన్ వ్యస్థాపకుడు అనిల్ చలమలశెట్టి, ఏస్ నెక్ట్ జెన్ సీఈఓ దిల్బాగ్ జిల్, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అక్బర్ ఇబ్రహీంతో కలిసి బుక్ మై షోలో టికెట్ల విక్రయాన్ని ప్రారంభించారు.
3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..
ఫిబ్రవరి 11న నిర్వహించే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీల నేపథ్యంలో నగరంలో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. రాష్ట్ర సచివాలయం ముందు, తెలుగుతల్లి విగ్రహం ఫ్లై ఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గం వైపు ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. అదేవిధంగా ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు, ఐమ్యాక్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. 10వ తేదీన 12 గంటల నుంచి 4.30 గంటలకు ప్రాక్టీస్ రేసింగ్‌లు ఉంటాయి. ఈ సమయంలో ఉచితంగా ప్రేక్షకులను గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. 11న జరిగే పోటీకి మాత్రం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారిని మాత్రమే అనుమతిస్తారు.
ఆన్లైన్లో 3 రకాల టికెట్ ధరలు..
పోటీలను వీక్షించేందుకు 3 రకాల టికెట్ల ధరలను నిర్ణయించారు. రూ.1000, రూ.3,500, రూ.6000 చొప్పున బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయి. సుమారు 25 వేల మందిని కూర్చునేలా సీట్లను ఏర్పాటు చేస్తున్నారు.
నగరంలో 10 చోట్ల భారీ తెరలు..
ఫిబ్రవరి 11న జరిగే పోటీల ప్రసారాలను ప్రత్యక్షంగా చూసేందుకు నగరంలో 10 చోట్ల భారీ తెరలను ఏర్పాటు చేస్తామని ఆర్వింద్‌కుమార్ తెలిపారు. అవసరమైన చోట మరిన్ని తెరలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.