తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 14: తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, లలిత కళారంగాల పరిరక్షణకు శాంతా-వసంతా ట్రస్టు ఒక గొడుగులా పనిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. సంగీతం, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులకు శాంతావసంతా ట్రస్టు పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం అబిడ్స్ తిలక్రోడ్డులో గల తెలంగాణ సారస్వత పరిషత్తు ఆడిటోరియంలో జరిగింది.
ఈ సందర్భంగా పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగతున్న ట్రస్టు ప్రముఖ సాహితీవేత్త విశాఖపట్టణానికి చెందిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మంకు డాక్టర్ వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం, సుజనరంజని వ్యవస్థాపకులు మహీధర సీతారామశర్మకు కోడూరు వెంకటరమణారెడ్డి తెలుగు భాషా సాహితీసేవారత్న పురస్కారం, ప్రముఖ వీణా విద్వాంసులు వడలి ఫణి నారాయణకు వసంతా వరప్రసాదరెడ్డి సంగీత రత్న పురస్కారాన్ని అందజేశారు. పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువాతో సత్కరించారు.
సమాజ నిర్మాణానికి సాహిత్యం దోహదం..
డాక్టర్ కేవీ రమణాచారి ప్రసంగిస్తూ.. సమాజ నిర్మాణానికి భాష, సాహిత్యం, కళా సాంస్కృతిక రంగాలు దోహదం చేస్తాయన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, వరప్రసాదరెడ్డి సతీమణి వసంత, ట్రస్టు కార్యదర్శి తొడుపునూరి నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వై.శివరామ ప్రసాద్ రచించిన ఇదం శరీరం శ్రీచక్రం పుస్తకాన్ని వక్తలు ఆవిష్కరించారు. డాక్టర్ చల్లగాలి వెంకట్రాజ్ రాగయుక్తంగా తెలుగు పద్యాలను గానం చేసి ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి.. వేమరాజు
వేమరాజు నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. నవ్య సాహితీ సమితి, నవ్య నాటక సమితిల సంయుక్తాధ్వర్యంలో సుల్తాన్బజార్లో గల శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఆడిటోరియంలో ఆదివారం వేమరాజు నర్సింహారావు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేమరాజు నర్సింహారావు స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రముఖ పత్రికా రచయిత టీ ఉడయవర్లుకు ప్రదానం చేశారు.. వర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టీ గౌరీశంకర్ ప్రసంగిస్తూ వేమరాజు నర్సింహారావు స్మారక సాహిత్య పురస్కారాన్ని ఉడయవర్లుకు అందజేయడం సముచితమని అన్నారు. రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ ఉపసంచాలకురాలు వసుంధర, సాహితీవేత్తలు ఆచార్య వంగపల్లి విశ్వనాథం, డాక్టర్ జీఎల్కే దుర్గ పాల్గొని వేమరాజుతో గల సాహితీ అనుభవాన్ని పంచుకున్నారు. వేమరాజు విజయకుమార్, లక్ష్మి, అపూర్వ స్వాతి, ఆర్.ఎన్ సుధారాణి, యూ సత్యవాణి పాల్గొన్నారు.