Ghatkesar | ఘట్కేసర్, జూన్ 24: ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఘట్కేసర్కు చెందిన ప్రవీణ్, చిన్న కలిసి మహేశ్‌ను తామే హత్య చేసినట్లు తెలిపి ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. ఘట్కేసర్ సమీపంలో ఓ ప్లాట్ విషయంలో తలెత్తిన వివాదంతో చిన్న, ప్రవీణ్‌తోపాటు మరో నలుగురు కలిసి గడ్డం మహేశ్‌ను హత్య చేశారు. అనంతరం ఘట్కేసర్ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద జేసీబీతో గోయితీసి శవాన్ని పూడ్చివేశారు. సోమవారం ఏసీపీ చక్రపాణి ఆధ్వర్యంలో పోలీసులు ఎమ్మార్వో రజిని సమక్షంలో శవాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మహేశ్ కనిపించడం లేదని ఈ నెల 17న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా.. ఈ ఘోరం బయటపడింది.
మహేశ్ హత్యకు కారకులైన వ్యక్తుల ఇంటి వద్ద మృతుడి కుటుంబ సభ్యులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘట్కేసర్ సీఐ సైదులు, పోచారం సీఐ రాజు కలిసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.