కొండాపూర్, సెప్టెంబర్ 14 : ఒక్కసారి కూడా మంత్రి కాకుండా కేవలం నాలుగేండ్లలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్రెడ్డి అదృష్టవంతుడని, ఇది నేనిప్పటి వరకు చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు అన్నారు. బీసీల ఓట్లతో అగ్రవర్ణాలు రాజ్యమేలుతున్నాయన్నారు.
దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన చేపట్టాలంటూ శనివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన క్యార్యక్రమానికి మాజీ ఐపీఎస్ పూర్ణ చందర్రావు, మాజీ ఏఐఎస్ చిరంజీవులు, స్టూడెంట్స్ నాయకులతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓబీసీ కుల గణన చేపట్టి ఆ అదృష్టాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా దేశాన్ని పాలించి, చేసిందేముందంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రశ్నకు సమాధానంగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వెంటనే ఓబీసీ కుల గణన చేపట్టి న్యాయం చేయాల్సిందిగా తెలిపారు. హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని మూడు నెలల్లో కుల గణన పూర్తి చేయాలంటూ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. పూర్ణ చందర్రావు మాట్లాడుతూ దేశంలో వర్ణ, కుల వ్యవస్థను పటిష్టం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సగానికి పైగా ఉన్న బీసీలు 50 శాతం రిజర్వేషన్లకు నోచుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో హెచ్సీయూ విద్యార్థి సంఘాల నాయకులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.