ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటుకు కృషి
జయంతి కార్యక్రమంలో గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి కొప్పుల
కవాడిగూడ, డిసెంబర్ 25 : తెలంగాణ ఉద్యమ నాయకురాలు, స్వర్గీయ మాజీ మంత్రి సదాలక్ష్మి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆమె నిలువెత్తు విగ్రహాన్ని నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. శనివారం తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో స్వర్గీయ మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి 93వ జయంతి కార్యక్రమాన్ని ఆమె తనయుడు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంపీ బండి సంజయ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, ప్రొఫెసర్లు జూపాక సుభద్ర, సూరేపల్లి సుజాత, కవి, రచయిత గోగు శ్యామల, హెచ్‌సీయూ వీఆర్ఓ వైస్ చాన్స్‌లర్ సర్రాజ్, డాక్టర్ శంకర్, డాక్టర్ వెంకట్ నర్సయ్య, గండి కృష్ణ, రాజలింగం, దళిత సంఘాల నాయకులు మేరీ మాదిగ, కృపాకర్ మాదిగ, తదితరులు హాజరై ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పుల రమేశ్ రచించిన ‘టీఎన్ సదాలక్ష్మి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దళితులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి టీఎన్ సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పైన లేదా ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.