హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాషనే మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం మద్దతుతోనే నవీన్‌యాదవ్ ఆ నియోజక వర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలు జరిగాయన్నారు.
కానీ అక్కడి ప్రచారంలో కాంగ్రెస్ నేతలు బెదిరించే విధంగా, బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఇతర పార్టీ వాళ్లనెవరిని బెదిరించలేదన్నారు. స్నేహపూర్వకంగానే మునుగోడు, నాగార్జునసాగర్, హుజూరాబాద్ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం సాగిందన్నారు. కానీ దానికి భిన్నంగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ మాత్రం పగతో, కక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమని బాల్క సుమన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో పట్టపగలే దొంగతనాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
మొత్తానికి మొత్తంగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ మాఫియా అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలోకి నడిస్తే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పథకాలు అటకెక్కించి ప్రజలను మోసం చేయడంతో పాటు నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు అడిగినందుకు నిరుద్యోగులపై లాఠిఛార్జీలు చేసే హీన సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు.
ఆడబిడ్డను అవమానించిన కాంగ్రెస్ నాయకులు..
జూబ్లీహిల్స్ ఎన్నికలో కౌరవ ముఠా లాగా కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి దిగారు అని, వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారన్నారు. కానీ భర్తను కోల్పోయిన ఒక ఆడబిడ్డపైన గెలువడం కోసం కౌరవ ముఠాలాగా వారు దిగారు అని దుయ్యబట్టారు. ప్రచారంలో భాగంగా భావోద్వేగానికి గురైన అభ్యర్థి మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే, ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు మాత్రం అసభ్యంగా మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఎం సోదరుల అవినీతి గురించి మంత్రి కొండాసురేఖ కూతురు మాట్లాడారు అని విమర్శించారు. మంత్రుల మధ్య వాటాల కోసం కొట్లాటలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.
పాస్టర్, బీఆర్ఎస్ బూత్ కమిటీ కన్వీనర్‌ను బెదిరించారు
ఉప ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మద్దతుతో కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక ప్రముఖ పాస్టర్, బీఆర్ఎస్ బూత్ కమిటీ కన్వీనర్‌ను బెదిరింపులకు గురి చేశారని రవీందర్రావు ఆరోపించారు. వాళ్ల ఇండ్లపైనా దాడికి పాల్పడ్డారని, పైగా ఆ పాస్టర్‌ను పోలీసులు మానసికంగా వేధించారన్నారు. బూత్‌కమిటీ కన్వీనర్‌ను మాత్రం రాత్రిపూట కార్లో తీసుకుని పోయి, బెదిరించి బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పిన పరిస్థితి నెలకొన్నదని నిప్పులు చెరిగారు. ఈ దౌర్జన్యాలు, బెదరింపులు ఎందుకు అని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తున్న వారి ఇండ్లకు వెళ్లి బెదరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రచారం చేయనీయకుండా మఫ్టీలో ఉన్న పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
– ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
నవీన్యాదవ్లో అసహనం పెరిగింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్లో రోజు రోజుకు అసహనం పెరిగిపోతుందని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన ప్రజలను బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారం చేశాయి కానీ, నవీన్‌యాదవ్ మాదిరిగా జూబ్లీహిల్స్‌లో బెదిరించినట్టుగా ఎవరిని బెదిరించలేదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలను బెదిరిస్తే ఎవరూ భయపడరని ఆయన స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లు జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆంజనేయగౌడ్, రాజీవ్‌సాగర్, రవీందర్‌రెడ్డి, విజిత్‌రావు పాల్గొన్నారు.
-మాజీ ఎమ్మెల్యే నోముల భగత్