హైదరాబాద్ : జర్నలిస్టుల అరెస్ట్ అప్రజాస్వామికం అని మాజీ మంత్రి, సనతర్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, చారిలను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అవసరమా? ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు టెర్రరిస్టులు కాదు? వారిపట్ల ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నాని మండిపడ్డారు. వాళ్ల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయి, పండుగ పూట అరెస్టులు సరికాదన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఎన్టీవీ ఇన్‌ఫుట్ ఎడిటర్ దొంతు రమేశ్, రిపోర్టుర్లు పరిపూర్ణచారి, సుధీర్లను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తుండగా దొంతు రమేశ్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేయగా.. మరో ఇద్దరు రిపోర్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఐఏఎస్, మంత్రి వార్త వ్యవహారంలో ఎన్టీవీ న్యూస్ ఛానల్‌పై చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు. కానీ వారిని అరెస్టు చేసిన విషయాన్ని బయటకు వెల్లడించలేదు. వారిని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.