రవీంద్రభారతి,నవంబర్8:రెండేళ్ల కాం గ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల నిధులు కేటాయిస్తూ, ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో అఖిల పక్ష విద్యార్థి సంఘాలు , తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఫీజు పోరు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు రావాల్సిన రూ. 8వేల కోట్ల నిధులు విడుదల చేయకుండా బడుగు బలహీన వర్గాల విద్యార్థులను చదువుకోకుండా సీఎం రేంవత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో కాంట్రాక్టర్లకు ఎన్ని నిధులు కేటాయించారు..విద్యార్థులకు ఎన్ని కేటాయించారో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయిల పోరుకు అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఐక్యపోరుకు ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటన్నారు. ఫీజుల బకాయిలకు కమిటీలు వేస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. ఫీజుల బకాయిలు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని,అందుకే కాలేజీల బంద్‌ను విరమించుకున్నాయని తెలిపారు. సీఎం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో రూ. లక్షల కోట్ల నిధులు మంజూరు చేస్తుందని, నిధులు ఎలా వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రూ. 3వేల కోట్ల బకాయిలను విద్యార్థులకు చెల్లించిందన్నారు. 15న అఖిల పక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, బీసీ నేతలు గుజ్జ కృష్ణ నందగోపాల్ జగదీశ్, రాహుల్, ప్రణీత్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వంశీకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.