రంగారెడ్డి మే, 29 (నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతులకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి స్థలాలు చూపించలేకపోతున్నదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్ రెడ్డి జైపాల్ యాదవ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల బృందం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. పట్టాలు పొందిన రైతులందరికీ ఇండ్ల స్థలాలు చూపించాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గం 14 వేల ఎకరాలను సేకరించిందని, భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు ఒక గుంట చొప్పున ఇండ్ల స్థలాల పట్టాలిచ్చిందన్నారు. రైతుల కోసం సుమారు 600 ఎకరాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెంచర్ ఏర్పాటు చేసిందన్నారు.
ఈ వెంచర్లో యాచారం మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన 979 మంది కందుకూరు మండలంలోని వివిధ గ్రామాల చెందిన 686 మంది రైతులకు ఇండ్ల స్థలాల కోసం పట్టాలిచ్చామన్నారు. పట్టాలు పొందిన రైతులకు స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినప్పటికీ వారికి స్థలాలు చూపించడం లేదన్నారు.
ప్రస్తుతం కలెక్టర్ నారాయణరెడ్డి గత సంక్రాంతి నాటికి పట్టాలు పొందిన రైతులందరికీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఫీజులను చెల్లించి స్థలాలు చూపుతామని హామీ ఇచ్చారని, ఇంతవరకు స్థలాలు చూపలేదన్నారు. గుర్రంగూడ గ్రామంలోని అనేకమంది పేదలు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుని జీవిస్తున్నారని ఆ భూములను ప్రభుత్వం తీసుకోవాలని అనుకోవడం సమంజసం కాదన్నారు.