బడంగ్ పేట్, మే 6: న్యాయవ్యవస్థపై తాను ఉంచిన నమ్మకం నేటి తీర్పుతో రుజువైందని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 12 సంవత్సరాల నిరీక్షణకు తెరపడిందన్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో సబితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎంతోమంది ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు సంబంధం లేకున్న ఈకేసులో తనను ఇరికించారని.. ఎన్నో అవమానాలను భరించానని ఆవేదన చెందారు. కష్టకాలంలో నియోజకవర్గం, జిల్లా ప్రజలు తనవెంటే ఉన్నారని.. వారి ప్రేమే నన్ను ఇంకా ప్రజాసేవలో నిలిచేలా చేసిందన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని తనకు నమ్మకం ఉండేదని.. అది నేటితో రుజువైందన్నారు. తనకు అండగా నిలిచిన ప్రజలందరికీ సబితారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు .
సబితారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం..
కోర్టు తీర్పును హర్షిస్తూ మీర్‌పేటలో సబితారెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ నేత అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు.. భూపేష్ గౌడ్, శీను నాయక్, దీప్లాల్ చౌహాన్, సిద్దాల బీరప్ప, అనిల్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, రాజ్ కుమార్, సునీత బాలరాజ్, విజయలక్ష్మి, సుర్వి లత, మదారి రమేష్, గోపి యాదవ్, లక్ష్మణ్, సిద్దాల అంజయ్య, వెంకట్ రెడ్డి, సహదేవ్, అవినాశ్, శేఖర్ గౌడ్, రజాక్, జగాల్ రెడ్డి, వెంకటేశ్, రామకృష్ణ, యాదగిరి, నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ తదితరులు పాల్గొన్నారు.