సిటీబ్యూరో/ బేగంపేట: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ బస్తీలను పట్టించుకోక, నాలాలు శుభ్రం చేయకపోవడం వల్లే నాలాల నుంచి వరద వచ్చిందన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం రాంగోపాల్‌పేట్ డివిజన్లో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన 1500 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని బాధిత కుటుంబాలకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఫ్రీ మాన్సూన్ ముందు నాలాలన్నీ క్లీన్ చేయించాలి..కానీ ఎక్కడా అలాంటివి కనిపించలేదు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నాలాలన్నీ క్లీన్ చేయించేవారు’ అని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ నాలాలు క్లీన్ చేయించకపోవడం వల్ల నాలాల నుంచి వరద నీరు బస్తీల్లోకి వచ్చి చేరి ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకుపోయాయన్నారు. బాధిత కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సహాయం కూడా వరద బాధితులకు అందలేదన్నారు. హైదరాబాద్‌లో 7,8 మంది నాలాల్లో పడి కొట్టుకుపోయి చనిపోయారని, వారి చావులకు కారణం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారు..
కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని రేవంత్‌రెడ్డి పూర్తిగా బరితెగించి మాట్లాడుతున్నాడని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీసేలా రేవంత్ ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేమే పార్టీ మారమని ఎక్స్‌లో పెట్టుకున్నారు. పది మందిని పార్టీలో చేర్చుకున్నామని పీసీసీ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించుకున్నారు’ అని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు.
బతుకమ్మ పండుగకు రేవంత్‌రెడ్డి ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవన్నారు. ఈ బతుకమ్మ పండుగ పూటైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను జరుపుకొనేటట్టు చేయాలన్నారు. వరదల్లో మునిగి పోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని కోరారు. అలాగే బాధితులకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు నిత్యావసర సరుకులు అందించాలని హరీశ్‌రావు సూచించారు.