రంగారెడ్డి, సెప్టెంబరు 11(నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు మహేశ్వరం మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తోంది. కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే మొదలుకానుంది. టీచింగ్ స్టాఫ్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలను సైతం పూర్తిస్థాయిలో చేపట్టనున్నారు.
ఈ ఏడాది అక్టోబరు 14 నుంచి తరగతులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేయగా..దీని వెనుక అప్పటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కృషి ఉన్నది. కళాశాల నిర్మాణానికి అప్పట్లోనే ప్రభుత్వం రూ.176 కోట్లకు పరిపాలన అనుమతులను ఇచ్చింది. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో తేవడంతోపాటు సామాన్యులకు వైద్యం అందించాలన్న కేసీఆర్ సంకల్పం సాకారమవుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
కేంద్రం సహకరించనప్పటికీ గత ప్రభుత్వంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో కాలేజీ ఏర్పాటు కోసం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే మంజూరు చేశారు. పరిపాలన అనుమతులను సైతం అప్పటి ప్రభుత్వం జారీ చేసింది. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలోని సర్వే నంబర్ 112లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదించగా..టీఎస్ఐఐసీ 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి, 450 పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల కోడ్ రావడం..కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కళాశాలకు సంబంధించిన ప్రక్రియ నిలిచిపోయింది.
కాలేజీకి అనుమతులను ఇవ్వడంలో జాప్యం నెలకొంది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 50 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే మొత్తం 59 మంది అధ్యాపక సిబ్బంది ఉండాలి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రిలో బెడ్స్‌తోపాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌లో తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు బదిలీలు చేపట్టడంతోపాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇచ్చారు.
ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ప్రభుత్వం ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ప్రభుత్వం మొత్తం 8 కాలేజీలకు అనుమతుల కోసం ప్రయత్నించగా..కేవలం నాలుగింటికి మాత్రమే అనుమతులు లభించాయి. మహేశ్వరం కాలేజీకి మరోసారి భంగపాటు కలగడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని లోపాలను సరిదిద్ది సెకండ్ అప్పీల్‌కు వెళ్లింది. కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఏమైనా..సౌకర్యాలు, స్టాఫ్ అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పరిశీలించిన ఎన్ఎంసీ మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుమతులకు ఆమోదముద్ర వేసింది.