బడంగ్ పేట్, మార్చి 4: బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కార్పొరేటర్ల పదవీకాలం ముగిసి పోయినప్పటికీ ఇంకా తామే కార్పోరేటర్ల మన్న ధీమాతో అధికారులపై పెత్తనం చెల్లాయిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అధికారులకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్లు ఎత్తితే ఒక బాధ, ఎత్తకపోతే మరోలా వ్యవహా ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాము చెప్పినట్లు వినకపోతే ఇక్కడ పని చేయలేరని వర్నిగ్ ఇస్తున్నారు. దీంతో తాజా మాజీ కార్పొరేటర్ల ఫోన్లు వస్తేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన వారి మాట వినకపోతే బదిలీ చేయిస్తామని బహిరంగంగానే బెదిరిస్తున్నట్లు కొంతమంది అధికారులు వాపోతున్నారు. ఇలా అయితే ఇక్కడ పని చేయలేమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకోవాలన్న ప్రయత్నంలో కొంతమంది అధికారులు ఉన్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కేసీఆర్ బ్యానర్లు కానీ, ప్లెక్సీలు కానీ ఎక్కడైనా కనిపిస్తే అధికార పార్టీ నేతలు అధికారులపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్టు తెలుస్తుంది. మరికొంతమంది అధికార పార్టీ నేతలు వివిధ డివిజన్లలో ఇంటి నిర్మాణదారులను సైతం బెదిరిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినాలని, తమను సంప్రదించిన తర్వాతే ఇండ్లు కట్టుకోవాలని వార్నింగులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజులోనే అధికారులకు పదుల సంఖ్యలో ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. ఫోన్లు ఎత్తకపోతే తీవ్ర పదజాలంతో దూషిస్తున్నట్లు కొంతమంది అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదవుల అయిపోయినప్పటికీ నిత్యం మున్సిపల్ కార్యాలయంలో నిత్యం తిష్ట వేసి అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నా బయటకు చెప్పుకోలేక అధికారులు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. ఇంటి అనుమాతల విషయంలో, డోర్ నెంబర్ల విషయంలో అధికారులను ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది. సరైన పత్రాలు లేకుండా డోర్ నెంబర్లు జారీ చెసే విషయంలో అధికారులతో పలుమార్లు వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది.
కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్లు చెప్పడంతో కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలతో ముందస్తు పనులు చేశారు. పనులు త్వరగా చేయాలని హడావుడి చేశారు.నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించారు. పనులు ఒకరు చేస్తే టెండర్ మరో కాంట్రాక్టర్కు వచ్చింది. దీంతో లక్షలు పెట్టి పనులు చేసిన వారికి ఇబ్బందులు తప్పలేదు. ఏం చేయాలో తెలియక కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.తాజా మాజీ కార్పొరేటర్ల భరోసాతో పనులు చేస్తే తమకు లక్షల్లో నష్టం వచ్చిందని కొంతమంది కాంట్రాక్టర్లు ఆందోళనలో ఉన్నారు. టెండర్ వేయకుండా ముందస్తు పనులు చేయాలని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
అధికారులతో మాట్లాడి ఒప్పిస్తామని భరోసా ఇచ్చి ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. టెండర్ వచ్చిన వారితో మాట్లాడిన ఇలాంటి ప్రయోజనం లేదని తాజా మాజీల మాటలు నమ్మితే నట్టేట ముంచారని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. పనులు చేయాలని ఒత్తిడి చేసిన వారు ఇప్పుడు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవి పోయిన తర్వాత కూడా అధికారులను,కాంట్రాక్టర్ల, వేధింపులు ఆగలేదని తెలుస్తోంది. తాజా మాజీల బెడద పోయేది ఎప్పుడోనని ఆందోళనలో ఉన్నారు. అధికారం ఉంది కదా అని వారి ఆగడాలకు అంతు లేకుండా పోయింద ని ఆరోపణ వినిపిస్తున్నాయి. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేయాలంటేనే అధికారులు భయపడుతున్నారు.