కొండాపూర్, అక్టోబర్ 26 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇటు అధికార పార్టీ.. అటు ప్రతిపక్ష బీజేపీ పార్టీలకు రోజుకో సీనియర్ లీడర్లు రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బీజేపీకి(BJP) చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆదివారం తన రాజీనామా చేసిన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన వ్యక్తిగత కారణాలతో పార్టీని విడుతున్నట్లు, ఇంతకాలం సహకరించిన పార్టీకి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు చంద్రిక గౌడ్ పార్టీని వీడడం అంతర్గత కలహాలను బహిర్గతం చేశాయి.
తనను తన పార్టీకి చెందిన వారే వ్యక్తిగతంగా దూషించడం, పనిగట్టుకుని నిందలు వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ లు రాష్ట్ర, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ శేరిలింగంపల్లి నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. రాజీనామాలు చేసిన నాయకుల చూపు బీఆర్ఎస్ వైపే ఉందని గుసగుసలు ఆడుతున్నారు. త్వరలో మరింత మంది ప్రజాప్రతినిధులు, నాయకుల రాజీనామాలు చేసే అవకాశం లేకపోదని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.