Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఒక రాష్ట్రంలో కార్లు చోరీ చేసి.. మరో రాష్ట్రంలో వాటి నంబర్ ప్లేట్, చాసిస్ నంబర్ మార్చేసి.. నకిలీ నంబర్‌తో ఇంకో రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయిస్తున్న ఘరాన ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.2.45 కోట్ల విలువైన 18 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ సునీల్‌దత్, టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి డీసీపీ శబరీష్ వివరాలను వెల్లడించారు.
కోల్‌కతాకు చెందిన బప్పా ఘోష్ ఈ ముఠాకు నాయకుడు. ఒక ముఠాకు మరో ముఠాకు సంబంధం లేకుండా మూడు వేర్వేరు ముఠాలు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. దొంగతనం చేయడం, నంబర్ ప్లేటు మార్చడం, విక్రయించడం వీరి పని. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో హై హెండ్ కార్లను అపహరించి వాటిని ముఠా నాయకుడు బప్పా ఘోష్‌కు అప్పగిస్తారు. వాటికి పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ఇంజన్, చాసిస్ అసలు నంబర్లను తూడ్చేసి వాటి స్థానంలో నకిలీ నంబర్లను ముద్రిస్తారు. నకిలీ నంబర్లు వేసేందుకు కోల్‌కతాలో బప్పా ఘోష్‌కి ప్రత్యేకమైన మరో ముఠా ఈ పనిచేస్తుంది.
ఆ కార్లను మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందిన వాహనాల నంబర్లను ముద్రించి నకిలీ ఆర్సీలు తయారు చేస్తారు. వాటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలలో కార్లు డీలింగ్ చేసే చిన్న చిన్న డీలర్ల ద్వారా అమాయకులకు తక్కువ ధరకు ఎన్ఓసీ లేకుండా విక్రయిస్తున్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి వాహనం మారితే ఎన్ఓసీ ఆన్లైన్లో చూసిన తరువాతే ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఎన్ఓసీ ఆన్లైన్లో పెట్టడం సాధ్యం కాకపోవడంతో ఎన్ఓసీ లేకుండా, నకిలీ ఆర్సీలతో అమాయకులకు తక్కువ ధరకు కార్లను విక్రయిస్తున్నారు. ఎన్ఓసీ అడిగితే నెల రోజుల్లో ఎన్ఓసీ వస్తుందని, మాట్లాడుకున్న ధరకు రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు ఆపేసి, ఎన్ఓసీ వచ్చిన తరువాత ఆ డబ్బు ఇవ్వమంటూ సూచిస్తారు. ఆ తరువాత ఎన్ఓసీ రాదు.. ఆ డబ్బులు తీసుకోరు. ఇదంతా ఒక ఫ్లాన్ ప్రకారం జరుగుతున్నది.
చిలకలగూడ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు తక్కువ ధరకు కారు వస్తుందని రహీం ఖాన్ నుంచి కొనుగోలు చేశాడు. ఇతర రాష్ర్టాలకు చెందిన కార్లు కొన్నప్పుడు ఎన్ఓసీ కూడా అవసరముంటుంది. ఖరీదు చేసిన ధరకు లక్ష రూపాయలు తక్కువ తీసుకున్న రహీం ఖాన్, ఎన్ఓసీ ఇవ్వడానికి కాలయాపన చేస్తుండడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అది చోరీ వాహనం అని తేలింది. దీంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇందులో భాగంగానే నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి బృందం రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై ఆరా తీయడంతో భారీ నెట్వర్క్ బయటపడింది. దమ్మాయిగూడకు చెందిన ఠాకూర్ శైలేంద్ర సింగ్, అబ్దుల్ రహీంఖాన్, వారసిగూడకు చెందిన షేక్ జావెద్, తుర్కయాంజల్‌కు చెందిన వరికుప్పల దశరథ్, ముషీరాబాద్‌కు చెందిన షాన్వాజ్ అలీఖాన్, హస్తినాపురంకు చెందిన కొడిమల్ల పరిపూర్ణచారి ముఠా నాయకుడైన బప్పా ఘోష్ అతడి అనుచరుడు ఖలీమ్లను సంప్రదించి వీలైనంత తక్కువ ధరకు కార్లను కొంటారు.
వాటిని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి కొన్ని లాభాలు చూసుకొని అమాయకులకు కట్టబెడుతున్నారు. ఇందులో వరికుప్పల దశరథ్, పరిపూర్ణ చారి, బప్పా ఘోష్‌పై గత ఏడాది మిర్యాలగూడలో కేసు నమోదైంది. ఈ కేసులో బప్పా ఘోష్, ఖలీమ్ మినహా మిగతా వారిని చిలకలగూడ పోలీసులతో కలిసి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బప్పా ఘోష్, అతడి అనుచరుడు ఖలీమ్‌లకు దేశ వ్యాప్తంగా ఇలాంటి నెట్‌వర్క్‌ను కొనసాగిస్తూ దొంగిలించిన కార్లను విక్రయిస్తుండటంతో పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు.