బంజారాహిల్స్, సెప్టెంబర్ 10: పదేళ్లపాటు లీజుకు ఇస్తే ఫోర్జరీ పత్రాలతో 99 ఏండ్ల లీజుకిచ్చారంటూ ఎన్ఆర్ఐకి చెందిన భవనంలో తిష్టవేయడంతోపాటు వృద్ధురాలిని బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నివాసం ఉంటున్న సీహెచ్.లక్ష్మీశ్వరి(85) అనే వృద్ధురాలి కొడుకు తిరుమల వెంకటేష్ అమెరికాలో ఉంటారు. అతడికి జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లో 576 గజాల స్థలంలో భవనం ఉంది.
2012లో సినీ నిర్మాత షేక్ బషీద్, అతడి భార్య షేక్ కరీమున్నీసా లీజుకు తీసుకున్నారు. పదేళ్లపాటు లీజుకు ఇచ్చినట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2023లో లీజు గడువు ముగియడంతో ఖాళీ చేయాలని యజమానులు చెప్పగా తమకు 99ఏండ్ల పాటు లీజు ఉందంటూ పత్రాలు చూపించారు.
2012నుంచి 2112 దాకా ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తి లేదంటూ షేక్ బషీద్ చెప్పడంతో లక్ష్మీశ్వరి షాక్కు గురయ్యారు. తప్పుడు పత్రాలతో తన ఇంటిని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో షేక్ బషీద్ మీద 34 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, అతడిపై పంజాగుట్ట పీఎస్లో రౌడీషీట్ సైతం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు షేక్ బషీద్తోపాటు అతడి భార్య కరీమున్నీసాల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.