సిటీబ్యూరో, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): అర్థరాత్రి చిట్టడవిలో చుక్కలు చూస్తూ, ఆకాశంలో జరిగే అద్భుతాలను భారీ టెలీస్కోప్ ద్వారా వీక్షించేలా వినూత్న కార్యక్రమాన్ని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మంచిరేవుల సమీపంలోని చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్‌లో సెరెన్ ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో స్టార్ గేజింగ్ క్యాంపును ప్రారంభించింది. హైదరాబాద్ అడ్వెంచర్ అండ్ ట్రెక్కర్ క్లబ్‌తో సంయుక్తంగా నైట్ క్యాంప్‌ను ప్రారంభించగా, 50 మంది ఔత్సాహికులతో తొలి బ్యాచ్ ప్రకృతి అందాలను అర్థరాత్రి వీక్షించారు.
క్యాంప్ వచ్చే పర్యాటకుల కోసం సీ స్టార్ స్మార్ట్ టెలీస్కోప్, డొబ్సియాన్ టెలీస్కోప్‌తో పాటు అంతరిక్షంలో ఉండే గ్రహాలను మరింత స్పష్టంగా చూసేందుకు వీలుగా సెలిస్ట్రాన్ అస్ట్రోమాస్టర్ను అందుబాటులో ఉంచినట్లుగా టీజీఎఫ్డీసీ ఈడీ రంజిత్ నాయక్ తెలిపారు. ప్రశాంతమైన వాతావరణం, కాలుష్య రహిత ప్రాంతంలో విశ్వంలో ఉన్న అద్భుతాలను వీక్షించేలా స్టార్ గేజింగ్ క్యాంప్‌ను తొలిసారి అడ్వెంచర్ టూరిస్టుల కోసం ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఏకో టూరిజం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.