బంజారాహిల్స్,జనవరి 26: ప్రేమిస్తున్నానని ఓ బాలికను నమ్మించి ఐదేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతుండటంతో పాటు పెండ్లి చేసుకుంటానంటూ మెహందీ రోజున ఉడాయించిన ఓ యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కాజానగర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ షోయబ్(22) అనే యువకుడు చెఫ్‌గా పనిచేస్తుంటాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి (20)తో ఐదేం డ్లుగా పరిచయం ఉన్నది. ఆమె మైనర్‌గా ఉన్నప్పుడే ప్రేమిస్తున్నానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. పలుమార్లు లైంగికదాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. దీంతో షోయబ్‌ను నిలదీయగా తాను ఆమెను పెండ్లి చేసుకుంటానని పలుమార్లు తప్పించుకున్నాడు.
ఎట్టకేలకు ఈనెల 25వ తేదీన పెండ్లి చేసుకుందామంటూ చెప్పడంతో వధువు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేసి పెండ్లి కార్డులు కూడా ప్రింట్ చేసి అందరికీ పంచారు. కాగా, ఈనెల 24న సాయంత్రం వధువు ఇంట్లో మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అయితే రాత్రి గడిచినా షోయబ్ రాకపోవడంతో మెహందీ ఫంక్షన్ రద్దు చేసుకున్నారు. అతడికి ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. ఇంటికి తాళం వేసి ఉన్నది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్‌పై ఐదేండ్లుగా లైంగికదాడికి పాల్పడిన మహ్మద్ షోయబ్‌పై బీఎన్ఎస్ 69తోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బంజారాహిల్స్, జనవరి 26: ఓ మైనర్‌ను ప్రేమ పేరుతో లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడటంతో పాటు పెండ్లి చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న యువకుడితో పాటు కుటుంబసభ్యులపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బాలిక(17)తో ఏడాది కిందట షూటింగ్స్‌లో లైట్‌మెన్‌గా పని చేస్తుండే కె.ఆనంద్(24) అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. దీంతోపాటు అతడి తల్లి పద్మ, సోదరి వరలక్ష్మి ఆమెను కలిసి బలవంతంగా ఆనంద్‌తో పెండ్లికి ఒప్పించారు.
కాగా, పెండ్లయిన తర్వాత గంజాయి సేవించడం, రాత్రంతా బయటకు వెళ్లి అవారాగా తిరగడం వంటివి చేస్తున్నాడు. దీంతోపాటు బాలికను తీవ్రంగా వేధిస్తుండటంతో పాటు పలుమార్లు దాడి చేశాడు. ఆనంద్ కుటుంబసభ్యులు సైతం మానసికంగా వేధించడంతో పాటు రూ.20లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. గతంలోనే రెండు తులాల బంగారం తాము ఇచ్చామని, అదనంగా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదంటూ బాలిక కుటుంబసభ్యులు తేల్చి చెప్పడంతో ఇటీవల ఆమెను పుట్టింట్లో వదిలిపెట్టారు. ఈ మేరకు బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు ఆనంద్‌తో పాటు అతడి కుటుంబసభ్యులపై బీఎన్ఎస్ 65(1), 85, 118(2), పోక్సో యాక్ట్, బాల్య వివాహాల నిరోధక చట్టం, వరకట్న నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.