సిటీబ్యూరో/ మారేడుపల్లి, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): రైళ్లలో ప్రయాణికులు ప్రత్యేకించి మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. మొన్న ఎంఎంటీఎస్‌లో యువతిపై లైంగిక వేధింపుల ఘటన మరవకముందే తాజాగా ఓ చిన్నారిని రైలులో ఒక వ్యక్తి లైంగికంగా వేధించి తన సెల్ఫోన్లో వీడియోలు తీసిన ఘటన వెలుగుచూసింది. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా అందులో ఉన్న 12 ఏండ్ల బాలిక అర్ధరాత్రి రెండు గంటలకు వాష్‌రూమ్ వెళ్లింది. గమనించిన దుండగుడు ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు కూడా తీశాడు.
బాలిక తప్పించుకుని కుటుంబసభ్యులకు వివరాలు చెప్పడంతో వారు అతనిని పట్టుకుని సెల్ఫోన్లో ఉన్న వీడియోలను చూశారు. వెంటనే 139కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా రైల్వే పోలీసులు సికింద్రాబాద్‌లో బీహార్‌కు చెందిన నిందితుడు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసును బీహార్ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. ఇదిలా ఉంటే డబీర్‌పూర సమీపంలో మహిళా కోచ్‌లోకి దూరిన కొందరు యువకులు వికృతంగా ప్రవర్తించి భయాందోళనలకు గురిచేశారని రైల్వే పోలీసులకు కొందరు యువతులు ఇటీవల ఫిర్యాదు చేశారు.ఇలా రైళ్లలో వరుసగా జరుగుతున్న ఘటనలతో మహిళా ప్రయాణికుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల రైళ్లలో నిరంతర తనిఖీలు, గస్తీ నిర్వహణ చాలా కష్టమవుతున్నదని రైల్వే పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఆర్పీఎఫ్, జీఆర్పీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నేరాల నియంత్రణ సవాల్‌గా మారిందనే అభిప్రాయం ఉంది. కాగా, ఇటీవల ఎంఎంటీఎస్ ఘటన తర్వాత రైల్వే శాఖ అప్రమత్తమై రైళ్లలో పానిక్ బటన్ పెట్టాలని నిర్ణయించింది. అయితే మహిళల భద్రతపై కొత్తగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ ఆచరణలోకి రాకపోవడంతో తాజాగా మరో ఘటన జరిగింది.