MLA Talasani | బేగంపేట్, ఫిబ్రవరి 21: రోడ్లపై రాకపోకలు సాగించే ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్ పాత్ వ్యాపారులకు చెప్పారు. రాంగోపాల్‌పేట డివిజన్లోని అంజలీ థియేటర్, చిత్ర దర్గా పరిసరాలలో పుట్ పాత్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదల పట్ల ట్రాఫిక్ పోలీసులు కర్కశంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో వారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి తమ జీవనోపాధి లేకుండా చేస్తే తమ కుటుంబాలు వీధిన పడుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులతో పలుమార్లు సమావేశమై పుట్ పాత్ వ్యాపారుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారిని ఇబ్బందులు పెట్టొద్దని కోరారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో అంజలీ థియేటర్, చిత్ర దర్గా పరిసరాలలో తొలగించిన పుట్ పాత్ వ్యాపారులు తిరిగి వ్యాపారాలు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు. దీంతో పుట్ పాత్ వ్యాపారులు శుక్రవారం రాంగోపాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వెస్ట్ మారేడ్‌పల్లిలోని కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. తమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో రాంగోపాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, పుట్ పాత్ వ్యాపారులు సతీష్, నర్సింగ్ రావు, శంకర్, చిన్న, రాణి, సన్నీ, అనిత తదితరులు ఉన్నారు.