Malakpet | మలక్పేట, ఫిబ్రవరి 21 : మలక్పేట నియోజకవర్గంలోని ఆజంపుర డివిజన్ పరిధిలోని పలు హోటల్స్, టిఫిన్ సెంటర్లపై శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లలో కిచెన్లు అపరిశుభ్రంగా ఉండడం, కిటికీలకు ఎలాంటి తెరలు ఏర్పాటు చేయకపోవడంతో దుమ్ము ధూళితో నిండి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా పాడైపోయిన కూరగాయలను, అవసరమైన ఉష్ణోగ్రతలో నిలువ చేయని చికెన్ వాడుతున్నట్లు గుర్తించారు.
అదేవిధంగా తలపాగా బ్లౌజులు, ఆఫ్రాన్లు ధరించకుండా కిచెన్లో వంటలు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వారిని హెచ్చరించారు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్రాంగణానికి సంబంధించిన ఫేస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా అందుబాటులో లేనట్లు గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వారికి నోటీసులు జారీ చేశారు. రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన అధికారులు, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.