Subbaiah Gari Hotel | సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : మేడిపండు చూడు మేలిమై ఉండు..పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చందాన నగరంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన హోటళ్ల అపరిశుభ్ర రూపం నెమ్మదిగా బయటపడుతున్నది. టీవీల్లో, సోషల్ మీడియాలో రుచికరమైన సంప్రదాయబద్ధమైన భోజనం తయారు చేస్తామంటూ ఆడంబరంగా ప్రచారం చేసుకుంటున్న రెస్టారెంట్ల అసలు స్వరూపం బట్టబయలైతున్నది.
ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు తెలిసొస్తున్నాయి. ఈ మేరకు కొండాపూర్‌లో సుబ్బయ్యగారి హోటల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగది ప్రాంతం చాలా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
నేల, గోడలు జిడ్డుగా మరకలతో నిండి ఉన్నట్టు, ఆహార వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించలేదని, పనిచేసే సిబ్బందికి హెడ్‌క్యాప్‌లు, గ్లౌజులు లేకపోవడం, స్టవ్‌లు, పాత్రలు, స్టోర్ రూం అపరిశుభ్రంగా ఉన్నట్లు పరిశీలనలో తేల్చారు.. దీంతో పాటు కుత్బుల్లాపూర్‌లోని జీడిమెట్లలో యశోద డైరీ ప్రొడక్ట్‌లో ఫ్లోరింగ్ తడిగా ఉందని, మురుగు కాల్వలు సరిగా లేకపోవడం, ఉద్యోగులు పరిశుభ్రంగా ఉండకపోవడం గుర్తించి సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ల్యాబ్‌కు పంపించిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు హెచ్చరించారు.