సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ): ఆహార నాణ్యతాప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. హబ్సీగూడలోని భీమవరం పలావ్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా.. నిర్వాహకులు ఫుడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.
వంటగదిలో అపరిశుభ్రమైన వాతావరణం, ఫ్రిజ్‌లో ఉన్న వస్తువులకు లేబుల్స్ లేకపోవడం, ఫంగస్ సోకిన క్యారెట్స్ ఉన్నట్లు తేల్చారు. ఫ్రిజ్‌లో వెజ్ అండ్ నాన్‌వెజ్ కలిపి ఉన్నట్లు, సింథటిక్ ఫుడ్ కలర్, వంటగది రాక్లలో బొద్దింకల దాడి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో పాటు బంజారాహిల్స్ నిలోఫర్ కేఫ్‌లో నిబంధనలు ఉల్లంఘించారని తేల్చారు. ఫ్రిజ్‌లో ఉన్న చక్కెర సిరప్, మసాలా దినుసులు.. తదితర ఆహార పదార్థాలకు లేబుల్స్ లేవని, అమ్మకానికి ఉంచిన కేక్‌లకు లేబుల్ లేనట్లు, వంటగదిలో కాలం చెల్లిన చీజ్ (0.5 కిలోలు), కశ్మీరీ పప్పురికా పొడి, వేరు శనగలు (5 కిలోలు) ఉన్నట్లు గుర్తించి, వాటిని సీజ్ చేశారు.
బంజారాహిల్స్ హైకు రెస్టారెంట్‌లోని వంటగదిలో నీరు, ఆహార వ్యర్థాలతో నిండిపోయిందని, అపరిశుభ్రంగా ఉన్నదని తేల్చారు. జీలకర్ర, నల్ల నువ్వులు, చింతపండు, ఎర్రతామర పిండి వంటి ఆహార పదార్థాల గడువు ముగిసినట్లు గుర్తించారు. హబ్సీగూడలో కృతుంగ ట్రైన్ రెస్టారెంట్లో నిబంధనల ఉల్లంఘన జరిగింది. బంజారాహిల్స్ రాజా డీలక్స్ రెస్టారెంట్లో రిఫ్రిజిరేటర్లో పచ్చి మాంసం నిల్వ ఉన్నదని, ఆహార పదార్థాలకు లేబుల్స్ లేవని తేల్చారు. సంబంధిత నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు.