మేడ్చల్, సెప్టెంబరు 24 : ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి సారించాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో సౌకర్యాల కల్పన, అభివృద్ధికి ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై పలు సూచనలు చేశారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లు, నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు,డ్రైనేజీ మరమ్మతులు, సిబ్బందికి జీవిత బీమా కల్పించడం తదితర అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ విలేకర్లతో మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఉండే సమస్యలపై పూర్తిగా అవగాహన ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే ఎక్కువగా స్థానికంగా ఉండే సర్పంచ్, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకే ఎక్కువగా ఉంటుందన్నారు. నిధుల కొరత కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించి, కొత్త పనులకు నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. ఇటీవల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక డ్రైనేజీ నీరు చెరువులు, కుంటల్లో కలిసి, కాలుష్య కాసారాలుగా మారాయన్నారు. ఒకప్పుడు తాగునీరు అందించిన చెరువులు నేడు మురికి కూపాలుగా మారి దోమలు, ఈగల, గుర్రపు డెక్కతో దుర్గంధ బరితంగా మారాయన్నారు. ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను కట్టుదిట్టం చేసి, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని ఆయన సూచించారు.