సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్పై దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని అనువైన ప్రాంతాలను ఎంపిక చేయగా.., వచ్చే రెండు నెలల్లో పనులు మొదలు కానున్నాయి. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో భూ యజమానులతో సంప్రదింపులు చేస్తుండగా.., కొందరరు రైతులు నేరుగా భూములిచ్చేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో తొలి దశలో 900 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్థాయిలో మూడు వెంచర్లను డెవలప్ చేయడంపై హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది.
సాగుతున్న భూ సమీకరణ..
హెచ్ఎండీఏ పరిధిలో రైతుల నుంచి సేకరించిన భూములను డెవలప్ చేసి విక్రయించాలని భావించింది. ఇందుకు ప్రతిపాదించిన కొర్రెముల, ప్రతాప సింగారం, బోగారం, దండు మల్కాపూర్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకున్నది. ప్రస్తుతం, ఆ ప్రాంతాల్లో భూ సమీకరణ వ్యవహారాలు సాగుతుండగా.., రెండు నెలల వ్యవధిలో పనులు మొదలు కానున్నాయి. రైతులకు వాటా 60 శాతం మేర డెవలప్ చేసిన ప్లాట్లను ఇవ్వనుండగా.., ఇప్పటికే హెచ్ఎండీఏకు భూముల తీసుకునేందుకు రైతులతో సంప్రదింపులు ముమ్మరం చేశారు.
సంప్రదింపులతో.. సమీకరణ పూర్తి
నగరం చుట్టూ ఉండే ప్రతాప సింగారం, కొర్రెముల, భోగారం, లేమూరు, దండు మల్కాపూర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే 900ల ఎకరాలకు పైగా భూమిని డెవలప్మెంట్ కోసం గుర్తించారు. భూ యజమానులను ఒప్పించి 60-40 రేషియోలో డెవలప్మెంట్ ఖర్చులతో లే అవుట్లుగా హెచ్ఎండీఏ తీర్చిదిద్దనుంది. అయితే, స్థానికంగా భూముల ధరలు పెరగడం, హెచ్ఎండీఏ ఇచ్చే వాటా సరిపోకపోవడం, డెవలప్మెంట్ పేరిట జరిగే జాప్యం వంటి అంశాలతో భూ సమీకరణ ఆలస్యం అవుతుండగా.., ఒకవేళ ప్రాజెక్టు మొదలుపెడితే నిర్ణీత గడువు ప్రాతిపదికన డెవలప్మెంట్ పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు వెంచర్ డెవలప్మెంట్ పనులు ఆలస్యమైతే… సకల సదుపాయాలతో లే అవుట్లు డెవలప్ అయ్యే నాటికి అక్కడ భూముల ధరలు పెరగడంతో… అనుకున్నంత మేర పరిహారం రావడం లేదనే భావనలో రైతులు ఉన్నారు. దీంతోనే భూములు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తుండగా.., వారితో ల్యాండ్ పూలింగ్ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. రైతులకు లాభదాయకంగా ఉండాలన్న భావనలున్నట్టు తెలుస్తుంది.