కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 19: ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం, ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మించాలని, క్రీడా మైదానం కోసం స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతి పత్రాన్ని అందించారు. నియోజకవర్గం పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ నుంచి గోకుల్ ప్లాట్స్ మీదుగా వసంత్ విహార్, హైటెక్ సిటీ వెళ్లేందుకు గోకుల్ జంక్షన్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించాలని కోరారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కేపీహెచ్బీ కాలనీ హైటెక్ సిటీ మార్గంలో, జేఎన్టీయూహెచ్ జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని, నిజాంపేట, ప్రగతినగర్, బాబుపల్లి ప్రాంతాలలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాహనదారులకు మేలు జరుగుతుందన్నారు. కూకట్పల్లి అంబేద్కర్ వై జంక్షన్లో బాలానగర్ నుంచి కూకట్పల్లి మార్గంలో అండర్ పాస్ బ్రిడ్జి, కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డ మార్గంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, ఈ రెండు బ్రిడ్జిలను నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యకు విముక్తి లభిస్తుందన్నారు. మూసాపేట నుంచి కేపీహెచ్బీ కాలనీ మార్గంలో మూసాపేట ఆంజనేయనగర్ చౌరస్తా, కైత్లాపూర్ చౌరస్తాలలో రెండు చోట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. ఫతేనగర్ నుంచి సనత్నగర్ వైపునకు వెళ్లే మార్గంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వం హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో రూ.40 కోట్ల నిధులను కేటాయించిందని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు. ఈ అండర్ పాస్ నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్నా, ఆస్తులను సేకరించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నష్ట పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఆస్తుల సేకరణ ప్రక్రియను పూర్తిచేసి, పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, కూకట్పల్లిలోని హుడా ట్రక్ పార్కు స్థలాన్ని క్రీడా ప్రాంగణానికి కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ట్రక్ పార్కును ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించి, ఈ స్థలాన్ని క్రీడాకారుల కోసం మైదానంగా తీర్చిదిద్దాలని కోరారు.