Osman Sagar | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు వరద భారీగా వచ్చి చేరుకుంటుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో జల మండలి అధికారులు అప్రమత్తమయ్యారు.
ఉస్మాన్ సాగర్ నిండు కుండలా మారడంతో.. ప్రాజెక్టు 10 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి 2,630 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1762.25 అడుగులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1788.85 అడుగులుగా ఉంది.
దీంతో మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మూసీ వరదను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు జల మండలి ఎండీ ఆదేశాలు జారీ చేశారు. మంచిరేవుల కల్వర్టుపై నుంచి వరద నీరు పారుతుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.